మంగళగిరిలో మళ్లీ మార్చారు

వైసీపీ అభ్యర్థుల మార్పులు అయిపోయాయని గత నెల 27న ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌.. ఆ మర్నాడు 8వ జాబితాలో, తాజాగా శుక్రవారం విడుదల చేసిన 9వ జాబితాలోనూ మార్పులు చేస్తూనే ఉన్నారు.

Updated : 02 Mar 2024 09:47 IST

సమన్వయకర్తగా మురుగుడు లావణ్య
నెల్లూరు లోక్‌సభకు విజయసాయిరెడ్డి
కర్నూలు అసెంబ్లీకి ఇంతియాజ్‌
9వ జాబితా విడుదల చేసిన వైకాపా

ఈనాడు, అమరావతి: వైసీపీ అభ్యర్థుల మార్పులు అయిపోయాయని గత నెల 27న ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌.. ఆ మర్నాడు 8వ జాబితాలో, తాజాగా శుక్రవారం విడుదల చేసిన 9వ జాబితాలోనూ మార్పులు చేస్తూనే ఉన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించిన నియోజకవర్గ సమన్వయకర్తల 9వ జాబితాలో నెల్లూరు లోక్‌సభకు వేణుంబాక విజయసాయిరెడ్డిని, కర్నూలు అసెంబ్లీ స్థానానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ను, మంగళగిరికి మురుగుడు లావణ్యను నియమించినట్లు వెల్లడించింది.

పాపం సాయిరెడ్డి!

వైకాపా తరఫున రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని ఇప్పుడు నెల్లూరు లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైకాపాకు గుడ్‌బై చెప్పారు. శనివారం ఆయన తెదేపాలో చేరబోతున్నారు. దీంతో నెల్లూరుకు అభ్యర్థి కోసం పలువురి పేర్లను పరిశీలించి, చివరికి సాయిరెడ్డిని ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి 2022 జూన్‌లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనకు 2028 జూన్‌ వరకు అంటే మరో నాలుగేళ్లు పదవీకాలం ఉంది. ఇంతలోనే నెల్లూరు లోక్‌సభ బరిలో దింపుతున్నారు. ‘నెల్లూరు లోక్‌సభ సమన్వయకర్తగా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ కొత్త బాధ్యతను చిత్తశుద్ధితో స్వీకరిస్తా’ అని సాయిరెడ్డి శుక్రవారం రాత్రి ఎక్స్‌ వేదికగా స్పందించారు.

నెల్లూరులో ఎదురీతే!

నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించిన వేమిరెడ్డి పార్టీ వదిలి వెళ్లిపోయారు. మరోవైపు సీనియర్‌ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీనీ వీడి తెదేపాలోకి వెళ్లారు. వారిపై అనర్హత వేటూ పడింది. నెల్లూరు లోక్‌సభ పరిధిలోకొచ్చే కందుకూరులో ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డిని తప్పించి కొత్త అభ్యర్థిని తీసుకువచ్చారు. ఇక మహీధర్‌రెడ్డి పార్టీలో ఉంటారా లేదా అనేది అనుమానమే. 2019లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్వీప్‌ చేసిన వైకాపాకు ఇప్పుడు జిల్లాలో సీనియర్లు లేక, ఉన్నవారు సరిపోతారో లేదో అర్థం కాక ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ అభ్యర్థిగా సాయిరెడ్డి తనను, జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులను ఎలా గెలిపించుకోగలుతారనేది ప్రశ్నార్థకమే.

మంగళగిరిలో ఆర్కే దెబ్బ!

మంగళగిరిలో మురుగుడు లావణ్యను కొత్త సమన్వయకర్తగా ప్రకటించారు. అక్కడ శుక్రవారం సాయంత్రం వరకూ గంజి చిరంజీవి సమన్వయకర్తగా కొనసాగారు. డిసెంబరు 11న సిటింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించారు. ఆ రోజునే ఆర్కే పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. ఓవైపు ఆర్కే వర్గం, మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వర్గాలతో చిరంజీవి పోరాడాల్సి వచ్చింది. 2014లో చిరంజీవి తెదేపా అభ్యర్థిగా ఆర్కేపై పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైకాపా అధికారంలోకొచ్చాక ఆయన ఆ పార్టీలో చేరారు. తన ప్రత్యర్థిని తీసుకువచ్చి, తనను పక్కన పెట్టారని కినుక వహించిన ఆర్కే డిసెంబరులో రాజీనామా చేశారు. తర్వాత వైకాపా పెద్దలు ఆయనతో సంప్రదింపులు జరిపి, మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చారు. అయితే చిరంజీవి కాకుండా మరో బీసీ అభ్యర్థిని మంగళగిరిలో నిలబెడితేనే తాను మద్దతిస్తానని పార్టీలోకి తిరిగి వచ్చేటప్పుడు ఆర్కే షరతు పెట్టినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యను నియమించారంటున్నారు. హనుమంతరావు కుటుంబసభ్యులు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులందరినీ వెంటబెట్టుకుని ఆర్కే శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఆ తర్వాతే లావణ్య పేరును ప్రకటించారు.

ఇంతియాజ్‌ అలా..అలా..

ఐఏఎస్‌ అధికారిగా ఉన్న ఏఎండీ ఇంతియాజ్‌ ఫిబ్రవరి 28న ఉదయం తన పదవికి స్వచ్ఛంద విరమణ చేస్తూ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సాయంత్రానికి ప్రభుత్వం నుంచి అనుమతిస్తూ జీఓ వచ్చేసింది. గురువారం ఆయన వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరిపోయారు. శుక్రవారం ఆయన పేరును కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని