తెదేపా నేతలను వేధించడమే లక్ష్యంగా ఏపీఎస్‌డీఆర్‌ఐ

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీఎస్‌డీఆర్‌ఐ)ని ఆయుధంగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను సీఎం జగన్‌ వేధిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Updated : 02 Mar 2024 06:24 IST

అందుకే రాజేశ్వరరెడ్డిని నియమించారు
ఆయన వైకాపా సన్నిహితుడు
గతంలో తెదేపా నేతలు నారాయణ, ఏలూరినీ వేధించారు
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీఎస్‌డీఆర్‌ఐ)ని ఆయుధంగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను సీఎం జగన్‌ వేధిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇందులో భాగంగానే వైకాపాకు సన్నిహితంగా ఉండే చిలకల రాజేశ్వరరెడ్డిని ఏపీఎస్‌డీఆర్‌ఐ స్పెషల్‌ కమిషనర్‌గా నియమించారని ఆరోపించారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను కావాలనే తప్పుడు కేసులో ఇరికించారని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌కు శుక్రవారం చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ విభాగాలను ప్రయోగించి తెదేపా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్న జగన్‌ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లేఖలో కోరారు.

‘గతంలో తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును డీఆర్‌ఐ వేధించింది. ఆయన సంస్థలు, ఇళ్లపై ఆకస్మిక తనిఖీలు చేశారు. భారీ జరిమానాలు విధించారు. మాజీమంత్రి, తెదేపా సీనియర్‌ నేత నారాయణకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాలపైనా దాడులు చేశారు. ఆ కోవలోనే శరత్‌ను అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డట్లు ఆరోపిస్తున్న సంస్థలో శరత్‌ 2019 డిసెంబర్‌ 19వ తేదీ నుంచి 2020 ఫిబ్రవరి 14 వరకు.. 68 రోజులు మాత్రమే అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఏపీఎస్‌ఆర్‌డీఐ డిప్యూటీ డైరెక్టర్‌ సీతారామ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులోనూ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) ఈ కేసును దర్యాప్తు చేస్తోందని, రూ.16 కోట్లు జరిమానా విధిస్తూ నోటీసులు కూడా ఇచ్చిందని స్పష్టంగా పేర్కొన్నారు. డీజీజీఐ విచారణ చేస్తున్న కేసును ఏపీఎస్‌డీఆర్‌ఐ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ చర్య ముమ్మాటికీ ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యుల్ని వేధించడానికేనని దుయ్యబట్టారు.  

వేధింపులు భరించలేక న్యాయస్థానాలను ఆశ్రయించారు

ఏపీఎస్‌డీఆర్‌ఐ వేధింపులు భరించలేక ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారని చంద్రబాబు గుర్తుచేశారు. ‘అసలు ఏపీఎస్‌డీఆర్‌ఐని ఎందుకు ఏర్పాటు చేశారు? లక్ష్యాల మేరకు ఆ విభాగం పనిచేస్తోందా? గత మూడేళ్లుగా వాళ్లు పెట్టిన కేసులెన్ని? తెదేపా నేతలు, వారి కుటుంబాలే లక్ష్యమా’ అని ప్రశ్నించారు. ‘గతంలో సీఐడీని ఉపయోగించుకున్నట్లే నేడు డీఆర్‌ఐని జేబు సంస్థగా వైకాపా వాడుకుంటోంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇలాంటి నీచమైన, చట్టవ్యతిరేక చర్యల్ని అడ్డుకోండి’ అని లేఖలో గవర్నర్‌ను చంద్రబాబు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని