రాజధాని లేకుండా చేశారు జగనన్న

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ఆరాటపడే కాంగ్రెస్‌కు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ఇతర పార్టీలకు మధ్య పోరాటం నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

Updated : 02 Mar 2024 10:39 IST

హోదా కోసం కాంగ్రెస్‌ అలుపెరగని పోరాటం
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఈనాడు, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ఆరాటపడే కాంగ్రెస్‌కు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ఇతర పార్టీలకు మధ్య పోరాటం నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే సత్తా, చిత్తశుద్ధి కాంగ్రెస్‌కే ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం ప్రత్యేకహోదా పైనే చేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని వెల్లడించారు. శుక్రవారం తిరుపతిలో ప్రత్యేకహోదా కోసం న్యాయసాధన సభలో ఆమె ప్రసంగించారు. ఇదే మైదానం సాక్షిగా రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా కల్పిస్తామని నరేంద్రమోదీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇంకా చాలా అంశాలు నెరవేర్చాల్సి ఉన్నా కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలో చంద్రబాబు, జగనన్న ఏ ఒక్కటీ తీసుకురాలేదని, వాటి కోసం నిలబడ్డారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ మోదీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయన్నారు. రాముడి భక్తుడిగా చెప్పుకొనే మోదీ మాట తప్పి ప్రజలను మోసం చేశారని, ఇదేనా భక్తి అని ప్రశ్నించారు.

పులి పిల్లి అయ్యింది..

‘ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేతగా జగనన్న నిరాహారదీక్ష చేశారు. మూకుమ్మడి రాజీనామా చేస్తే ఎందుకు రాదన్నారు. ఐదేళ్లలో ఎంతమందితో రాజీనామా చేయించారు? ఎంపీలను ఇస్తే పంజా విసురుతామన్నారు. పులి, సింహం అంటూ మాట్లాడారు. ఇప్పుడు పులి కాస్తా పిల్లి అయ్యింది. మీ పంజాను భాజపా కొట్టేసిందా? చంద్రబాబు 15 ఏళ్లు ప్రత్యేకహోదా కావాలని నాడు మాట్లాడారు. హోదా కోసమే భాజపాతో పొత్తు అన్నారు. సీఎం అయ్యాక దానిగురించి మాట్లాడలేదు. చంద్రబాబు, జగన్‌లకు భాజపాతో కనిపించని పొత్తు ఉంది. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు జగన్‌ అండగా నిలిచారు. వంగి వంగి దండాలు పెట్టారు. వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని షర్మిల అన్నారు.

ఒక్క రాజధాని అయినా కట్టారా..

‘రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. చంద్రబాబు సింగపూర్‌ పేరుతో 3డీ సినిమా చూపించారు. జగనన్న మూడు రాజధానులు నిర్మిస్తామన్నారు. ఒక్కటయినా అయిందా? దక్షిణ భారతదేశంలో మెట్రోలేని ఏకైక రాష్ట్రం ఏపీ’ అని షర్మిల పేర్కొన్నారు.

వీళ్లా వైఎస్‌ఆర్‌ వారసులు..

‘ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పారు. 23వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ విడుదల చేస్తామన్నారు. ఇప్పుడు ఆరు వేలే ఇచ్చారు. రైతులకు మద్దతు ధర లేదు. వైఎస్‌ ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఒక్కటీ పూర్తి చేయలేదు. మాట తప్పం.. మడమ తిప్పం అన్న వీళ్లు ఇప్పుడు మాట తప్పారు. వీళ్లా వైఎస్‌ వారసులు’ అంటూ దుయ్యబట్టారు.

ప్రత్యేకహోదా ప్రజల హక్కు: సచిన్‌ పైలట్‌

‘ప్రత్యేకహోదా అనేది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు. పదేళ్లుగా భాజపా దీన్ని ప్రజలకు దూరం చేసింది. నాడు ప్రణాళికాసంఘం దీన్ని అమలు చేయాలని చెప్పినా పక్కనబెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో భాజపా ఉనికి, ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే ఇవ్వడం లేదు. ఉన్నతవర్గాలకే భాజపా కొమ్ముకాస్తోంది. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా ఇస్తాం. కేంద్రం సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడుతోంది. అయితే రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు దీనిపై దిల్లీలో పోరాడారు. ఏపీ నుంచి ఎవరూ అడగలేదు. పదేళ్ల క్రితం రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 20 సీట్లే వచ్చాయి. నేను పీసీసీ అధ్యక్షుడిని అయ్యాక పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాను. ఏపీలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది’ అని రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌పైలట్‌ పేర్కొన్నారు. సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కనుమూరి బాపిరాజు, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, తులసిరెడ్డి, జేడీ శీలం, కొప్పుల రాజు, చింతా మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని