అంతా తికమక.. గజిబిజి.. గందరగోళం..

అంతా గజిబిజి.. గందరగోళంలా ఉంది వైకాపా అభ్యర్థుల ఎంపిక తీరు! నియోజకవర్గాల సమన్వయకర్తల పేరుతో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను మారుస్తున్న ముఖ్యమంత్రి జగన్‌.. ఈ మార్పులు చేర్పుల్లో చేస్తున్న గారడీ.. గందరగోళానికి ఆ పార్టీ నేతలూ అయోమయానికి గురవుతున్నారు.

Updated : 02 Mar 2024 07:42 IST

మిగిలేది ఎవరో.. నిలిచేది ఎవరో.. బరిలోకి దిగేది ఎవరో..?
సమన్వయకర్తల పేర్లలో మళ్లీ మార్పులు
ఈ వికృత బంతాటలో అత్యధికంగా బలవుతోంది బడుగులే
ఇదీ వైకాపా నియోజకవర్గాల సమన్వయకర్తల నియామక తీరు

ఈనాడు, అమరావతి: అంతా గజిబిజి.. గందరగోళంలా ఉంది వైకాపా అభ్యర్థుల ఎంపిక తీరు! నియోజకవర్గాల సమన్వయకర్తల పేరుతో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను మారుస్తున్న ముఖ్యమంత్రి జగన్‌.. ఈ మార్పులు చేర్పుల్లో చేస్తున్న గారడీ.. గందరగోళానికి ఆ పార్టీ నేతలూ అయోమయానికి గురవుతున్నారు. వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కించినట్లుగా నియోజకవర్గ సమన్వయకర్తగా పదవి ఇస్తారు.. ఆ వెంటనే పాము మింగేసినట్లుగా ఆ పదవి వేరేవారికంటూ తప్పించేస్తారు. ఇక్కడి వారిని అక్కడికి.. అక్కడి వారిని ఇక్కడికి.. తరవాత వీరిలో కొందరిని మరోచోటకు.. ఈ మధ్యలో కొందరి టికెట్లు ఎగిరిపోతున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ రోజు ఎవరు పార్టీ సమన్వయకర్తగా ఉన్నారనేదీ ఎప్పటికప్పుడు జాబితాను చెక్‌ చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పటి వరకూ వెలువడిన జాబితాల సంఖ్య 9కి చేరింది. మార్చిన జాబితాలనే మళ్లీ మళ్లీ మారుస్తుండడం ఆ పార్టీలో నెలకొన్న అస్థిరతను చాటుతోంది. అభ్యర్థుల సీట్లతో వైకాపా పెద్దలు ఆడుతున్న ఈ వికృత క్రీడలో అత్యధికంగా బలి అవుతోంది దళితులు, బడుగులే. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీలో నిలుస్తారన్నది చెప్పడం కష్టమనే మాట వినిపిస్తోంది

పైకే బీరాలు..

175కు 175 సీట్లు.. వైనాట్‌ కుప్పం.. అంటూ ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే బీరాలు పోతున్నారు. కానీ, అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఆ ఆత్మవిశ్వాసం ప్రదర్శించలేకపోతున్నారు. ఎవరిని ఎందుకు ఎంపిక చేస్తున్నారు.. మళ్లీ ఎందుకు మార్చేస్తున్నారనే విషయం అర్థం కాక ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. సామాజిక సమీకరణాలంటూ అధిష్ఠానం నెలల తరబడి చేస్తున్న కసరత్తు ఓ ప్రహసనంగా మారిందని ఆ నేతలే వాపోతున్నారు.

అటూ.. ఇటూ.. తర్వాత ఎటూ కాకుండా!

ఆర్టీసీ బస్సు బోర్డుపై విజయవాడ-గుంటూరు అని రాసి మధ్య అటూ ఇటూ రెండు బాణం గుర్తులుంటాయి. అంటే విజయవాడ నుంచి గుంటూరు, తర్వాత గుంటూరు నుంచి విజయవాడకు ఆ బస్సు తిరుగుతుందనేది దాని అర్థం. ఆ స్ఫూర్తినే ముఖ్యమంత్రి తీసుకున్నారేమో! అందుకే నియోజకవర్గాల అభ్యర్థులను అటూ ఇటూ మారుస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఎటూ కాకుండాపోతున్నారు.

  • తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడుకు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి లోక్‌సభకు మొదట మార్చారు.. ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో ఎంపీని మళ్లీ తిరుపతికే తెచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను మార్చి సత్యవేడులో కొత్త వ్యక్తిని నియమించారు.
  • ఇదే తరహాలో చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరుకు, అక్కడున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభకు మార్చారు. నారాయణస్వామి ఎదురుతిరగడంతో మళ్లీ ఎవరి స్థానాలకు వారిని మార్చారు. ఇద్దరూ ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటుంటే మళ్లీ గంగాధర నెల్లూరులో నారాయణస్వామిని తప్పించేసి, ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా ముఖ్యమంత్రి నియమించారు.

ఇక్కడ ఇంకో రకంగా...

ఎక్కడో విద్యా సంస్థలు నిర్వహించుకుంటున్న డాక్టర్‌ పెంచలయ్యను హడావుడిగా తన పార్టీలోకి  ముఖ్యమంత్రి జగన్‌ చేర్చుకున్నారు. పార్టీలో చేరేటప్పుడు పెంచలయ్యతోపాటు వచ్చిన ఆయన కుమార్తె కటారి అరవింద యాదవ్‌ను కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించేశారు. కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డిని పక్కనపెట్టేశారు. అయితే అరవింద యాదవ్‌ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టకుండానే.. ఫిబ్రవరి 28న కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు. పెంచలయ్య పార్టీలోకి చేరకముందే ఎమ్మెల్యే మధుసూదన్ను కనిగిరి నుంచి తప్పించారు. ఇవ్వాలనుకుంటే అప్పుడే ఆయనకు కందుకూరు ఇచ్చి ఉండొచ్చు. అలా చేయకుండా పెంచలయ్యను పార్టీలోకి తెచ్చుకుని, వారి కుటుంబానికి బాధ్యతను అప్పగించి..తర్వాత వారిని కాదని ఎమ్మెల్యే మధుసూదన్‌కు ఇచ్చారు. పెంచలయ్య కుటుంబాన్ని ఎందుకు పార్టీలోకి తీసుకువచ్చారో? ఆయన కుమార్తెను సమన్వయకర్తగా ఎందుకు నియమించారో...ఇప్పుడు మళ్లీ ఎందుకు తీసేశారో ఎవరికీ అంతుపట్టడం లేదు.

ఆర్కేపోయి...చిరంజీవి.. ఇప్పుడు లావణ్య

మంగళగిరిలో సిటింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి..అక్కడ గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించారు. ఆయన అప్పటి నుంచి నియోజకవర్గంలోని గ్రూపులను కలుపుకొని వెళ్లేందుకు శ్రమిస్తున్నారు. ఇటీవల పార్టీకి సంబంధించిన శిక్షణ కార్యక్రమం మంగళగిరి పరిధిలో నిర్వహించగా...భారీగా ఖర్చు పెట్టి బ్యానర్లు, ఫ్లెక్సీలు, సీఎంకు స్వాగత తోరణాలనూ ఏర్పాటు చేశారు. మూడు రోజులు తిరక్కుండానే శుక్రవారం మంగళగిరి నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమించేశారు. చిరంజీవిని తప్పించి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యను సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు వైకాపా ప్రకటించింది. ఇప్పుడు చిరంజీవి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరమైంది.

  • అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని తొలుత అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు..అరకు ఎమ్మెల్యే ఫల్గుణను పక్కన పెట్టారు. తర్వాత మాధవిని తప్పించి అరకు సమన్వయకర్తగా రేగం మచ్చలింగంను నియమించారు.
  • ఎమ్మిగనూరులో మొదట మాచాని వెంకటేష్‌ను తర్వాత ఆయన్ను తప్పించి బుట్టా రేణుకను నియమించారు. ఇలా పలు నియోజకవర్గాల్లో వైకాపా పెద్దలు సీట్ల బంతాటను కొనసాగిస్తూనే ఉన్నారు.

ఫ్లెక్సీల ఖర్చులు పెరిగిపోతున్నాయి...

ఎంపీ అభ్యర్థి మారగానే..సంబంధిత లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు/పార్టీ ఇన్‌ఛార్జులు ప్రచారం కోసం వేసుకున్న ఫ్లెక్సీలను వెంటనే మార్చుకోవాల్సి వస్తోంది. బుధవారం వరకు గుంటూరు లోక్‌సభ సమన్వయకర్తగా వెంకటరమణ ఉండడంతో ఆయన ఫొటోతోపాటు(సీఎం సహా)తమ చిత్రాలతో ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు వేయించుకున్నారు. బుధవారం హఠాత్తుగా రమణ స్థానంలో రోశయ్య వచ్చారు. దీంతో రమణ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను మార్చి రోశయ్య చిత్రాలతో కొత్త ఫ్లెక్సీలు వేసుకోవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలది. ఇవైనా ఎన్నికల వరకూ ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జులు మారినప్పుడల్లా స్థానిక నాయకులదీ ఇదే పరిస్థితి. ‘తరచూ ఈ ఫ్లెక్సీలను మార్చాల్సి వస్తోంది. వీటి పెట్టుబడే మాకు భారీగా పెరిగిపోతోంది’ అని వైకాపా నేతలే చెబుతున్న పరిస్థితి.


అంబటి పోయి.. ఉమ్మారెడ్డి వచ్చె.. ఉమ్మారెడ్డి పోయి కిలారు వచ్చే

గుంటూరు లోక్‌సభ స్థానానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును మార్చాలని సీఎం మొదట ప్రయత్నించారు. అందుకు ఆయన ససేమిరా అన్నారు. దీంతో చేసేది లేక ప్రత్యామ్నాయాలను వెతికారు. 2019లో అక్కడ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాలరెడ్డిని మళ్లీ తీసుకురావాలనుకున్నారు. కానీ ఆయన స్పందించలేదు. తర్వాత క్రికెటర్‌ అంబటి రాయుడును హడావుడిగా పార్టీలోకి చేర్చుకుని, ‘గుంటూరు నీదే పని చేసుకో’ అని ఆయనకు సీఎం చెప్పి పంపారు. అలా చెప్పి వారం తిరక్కుండానే అక్కడకు మళ్లీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను రమ్మన్నారు. అప్పుడు కూడా ఆయన అంగీకరించలేదు. ఇంకోవైపు తనకు సీటిచ్చి ఇప్పుడు ఇంకొకరిని ఎందుకు తెస్తున్నారో అర్థంకాక అవమానంతో అంబటి రాయుడు పార్టీకో నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. వెతగ్గా..వెతగ్గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ దొరికారు. ఆయన్ను సమన్వయకర్తగా నియమించారు. ఆయన ఫొటోలతో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని ఏర్పాటు చేసుకున్నన్ని రోజులు కూడా పట్టలేదు.. రమణను తీసేయడానికి. రమణను తప్పించి ఆయన బావ ఎమ్మెల్యే కిలారు రోశయ్యను గుంటూరు సమన్వయకర్తగా బుధవారం నియమించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని