కుర్చీ పోయిందనే అక్కసుతోనే సీఎంపై విమర్శలు

మాజీ మంత్రి కేటీఆర్‌ భ్రమల్లో బతుకుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ముందు స్పైడర్‌మ్యాన్‌ లాంటి మీ విన్యాసాలు, గిమ్మిక్కులు పని చేయవని పేర్కొన్నారు.

Published : 02 Mar 2024 04:39 IST

కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ధ్వజం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి కేటీఆర్‌ భ్రమల్లో బతుకుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ముందు స్పైడర్‌మ్యాన్‌ లాంటి మీ విన్యాసాలు, గిమ్మిక్కులు పని చేయవని పేర్కొన్నారు. పదేళ్లలో ప్రజలకు మంచి పనులు చేసుంటే సిట్టింగ్‌ ఎంపీ స్థానాలు కాపాడుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్‌లు శుక్రవారం అసెంబ్లీ మీడియాహాలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుర్చీ పోయిందనే అక్కసుతో సీఎంపై కేటీఆర్‌ విమర్శలు చేస్తున్నారని వీరేశం అన్నారు. మేడిగడ్డకు కేసీఆర్‌ను ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. సామేల్‌ మాట్లాడుతూ.. దేశంలోనే బలమైన నాయకుల్లో రేవంత్‌రెడ్డి 39వ స్థానంలో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తేనెటీగల్లా చుట్టుముడతామన్నారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ ప్రజలను రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని సూచించారు. అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తోందని పేర్కొన్నారు. కేటీఆర్‌ ప్రగల్భాలు పలుకుతున్నారని, సీఎంపై ఛాలెంజ్‌లు చేయడం మానుకొని, కనీసం ఒక్క ఎంపీ సీటైనా గెలవడానికి ప్రయత్నించాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని