రాహుల్‌కు 4 లక్షల మెజార్టీ... మా బాధ్యత

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపానే తమకు ప్రత్యర్థి అని..భారాసతో ఎలాంటి పోటీ లేదని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Published : 02 Mar 2024 04:42 IST

 భారాస పోటీలోనే లేదు.. భాజపాకు రెండో, మూడో వస్తాయి
మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపానే తమకు ప్రత్యర్థి అని..భారాసతో ఎలాంటి పోటీ లేదని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారమిక్కడ సచివాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. భాజపాకు రెండో, మూడో సీట్లు వస్తాయేమో తమకైతే తెలవదని అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని తెలంగాణలో నల్గొండ, భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కోరుతున్నామని..నాలుగు లక్షలకుపైగా మెజార్టీ తీసుకువచ్చే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. రాజకీయాల కారణంగా తమ ఆస్తులు తగ్గాయని చెప్పారు. ఆ తర్వాత మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పెద్ద లీడర్లమని అనుకుంటున్నారనీ... వారిద్దరూ ఎమ్మెల్యేలుగా ఓడిపోయారంటూ ఎద్దేవాచేశారు.

రాజీనామా చేద్దాం: కేటీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్‌

మల్కాజిగిరి లోక్‌సభ స్థానంనుంచి పోటీకి సిద్ధమా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేసిన సవాలుపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ‘నేను నల్గొండలో రాజీనామా చేస్తా..కేటీఆర్‌ సిరిసిల్లలో రాజీనామా చేయాలి. అక్కడ పోటీ చేసి నేను గెలుస్తా. కేటీఆర్‌ ఓడిపోతే భారాసను మూసివేస్తానంటూ కేసీఆర్‌ ప్రకటన చేస్తారా?’ అంటూ ప్రతి సవాలు విసిరారు. తాను ఓడిపోతే రాజకీయాలనుంచి తప్పుకొంటానన్నారు. కేటీఆర్‌కు రాజకీయ అనుభవం తక్కువ అనీ..తనది కేటీఆర్‌ స్థాయి కాదని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని