తిరుగుబాటు ఎమ్మెల్యేలు నల్లతాచులు!

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Published : 02 Mar 2024 04:53 IST

 హిమాచల్‌ సీఎం సుఖు వ్యాఖ్య
రాజకీయ సంక్షోభంపై ఖర్గేతో చర్చించనున్న విక్రమాదిత్య

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రెబల్స్‌తో భేటీ అయ్యేందుకు రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌కు తాను అనుమతిచ్చినట్లు ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు శుక్రవారం తెలిపారు. ఇలా ఒకపక్క సానుకూల ధోరణిని ప్రదర్శిస్తూనే మరోవైపు వారిపై తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. ప్లేటు ఫిరాయించిన ప్రజాప్రతినిధులను ‘నల్ల తాచులు’గా అభివర్ణించారు. తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్త నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌ దిల్లీ వెళ్లారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవనున్నారు. అంతకుముందు ఆయన హరియాణాలోని పంచకులలో బస చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

పార్టీలో అసంతృప్త వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఎమ్మెల్యే నందలాల్‌ను రాష్ట్ర ఏడో ఆర్థిక సంఘానికి ఛైర్మన్‌గా సీఎం నియమించారు. ఆయనకు క్యాబినెట్‌ హోదాను కట్టబెట్టారు. నందలాల్‌.. విక్రమాదిత్యకు సన్నిహితుడు కావడం గమనార్హం. మరోవైపు విక్రమాదిత్య తల్లి, పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌.. ముఖ్యమంత్రి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను ఆయన విస్మరించారని ఆరోపించారు. తాను భాజపాలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.

మనసు మార్చుకున్నారు..

శిమ్లాలో విలేకరులతో మాట్లాడిన సీఎం సుఖ్విందర్‌.. రెబల్‌ ఎమ్మెల్యేల్లో కొందరు మనసు మార్చుకున్నారని, తిరిగి కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారని తెలిపారు. విక్రమాదిత్య తనకు ఈ విషయాన్ని తెలియజేశారని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, అధిష్ఠానంతో మాట్లాడాలని తానే ఆయనకు సూచించానని తెలిపారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధమేనని చెప్పారు. రాష్ట్రంలోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటంతో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం తన మంత్రిపదవికి రాజీనామా చేసిన విక్రమాదిత్య సింగ్‌.. పార్టీ పరిశీలకులతో భేటీ అనంతరం మెత్తబడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని