2019లో ఒక్కో స్థానంలో 14.8 మంది

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1952లో సగటున 4.67 మంది పోటీ చేయగా 2019లో ఆ సగటు 14.8కి చేరింది.

Published : 02 Mar 2024 04:54 IST

లోక్‌సభ ఎన్నికల్లో పెరుగుతూ వస్తున్న అభ్యర్థులు
1952లో సగటున 4.67 మంది..

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1952లో సగటున 4.67 మంది పోటీ చేయగా 2019లో ఆ సగటు 14.8కి చేరింది. 1952లో జరిగిన ఎన్నికల్లో 489 స్థానాల్లో 1,874 మంది పోటీ చేశారు. 2019లో వారి సంఖ్య 8,039కి చేరింది (542 స్థానాలు). 1977 వరకూ జరిగిన ఎన్నికల్లో సగటున ముగ్గురి నుంచి ఐదుగురే పోటీలో ఉండేవారు. పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చి అనే స్వచ్ఛంద సంస్థ విశ్లేషణ ప్రకారం.. గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక సగటు పోటీదారుల సంఖ్య నమోదైంది. ఆ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి 185 మంది బరిలో ఉండటంతో సగటు పోటీదారుల సంఖ్య పెరిగింది. అప్పుడు తెలంగాణలో సగటు అభ్యర్థుల సంఖ్య 16.1గా నమోదైంది. గత ఎన్నికల్లో తెలంగాణ తర్వాత తమిళనాడులో ఎక్కువ మంది స్వతంత్రులు పోటీ చేశారు. నిజామాబాద్‌ తర్వాత ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గంగా కర్ణాటకలోని బెల్గాం నిలిచింది. అత్యధిక అభ్యర్థులు పోటీలో ఉన్న టాప్‌ ఐదు నియోజకవర్గాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచే ఉన్నాయి. 2019లో భాజపా 435 చోట్ల, కాంగ్రెస్‌ 420 చోట్ల పోటీ చేశాయి. ఈ రెండు పార్టీల మధ్య పోరు 373 స్థానాల్లో జరిగింది. బీఎస్పీ నుంచి మూడో అత్యధిక అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏడు జాతీయ పార్టీలు సగటున 2.69 మంది అభ్యర్థులను పోటీలో నిలిపాయి. పశ్చిమ బెంగాల్లో ఐదు జాతీయ పార్టీల నుంచి సగటున 4.6 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు దేశవ్యాప్తంగా 1.53 మంది అభ్యర్థులను సగటున పోటీలో నిలిపాయి. బిహార్‌లో 6, తమిళనాడులో 8 రాష్ట్ర పార్టీలు అభ్యర్థులను పోటీ చేయించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని