7 లక్షల మందికి బోధనా రుసుములు ఎగ్గొట్టడం సంక్షేమమా?: కొల్లు రవీంద్ర

తెదేపా ప్రభుత్వ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు బోధనారుసుములు చెల్లిస్తే..వైకాపా ప్రభుత్వం దాన్ని 9 లక్షల మందికి పరిమితం చేసిందని తెదేపా నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Published : 02 Mar 2024 05:14 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ప్రభుత్వ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు బోధనారుసుములు చెల్లిస్తే..వైకాపా ప్రభుత్వం దాన్ని 9 లక్షల మందికి పరిమితం చేసిందని తెదేపా నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తలాతోకా లేని నిబంధనలతో 7 లక్షల మంది దళిత, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉన్నతవిద్యను దూరం చేయడమే మీ సంక్షేమమా? అని సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాబ్‌ల కొనుగోలులో రూ.1,200 కోట్లు, విద్యాకానుక పేరుతో రూ.400 కోట్లు, నాడు-నేడు ముసుగులో రూ.3 వేల కోట్లు మొత్తంగా రూ.5 వేల కోట్లు..విద్యార్థుల పేరుతో జగన్‌ దోచుకున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌ ప్రభుత్వం విద్యాదీవెన సొమ్ము రూ.2,700 కోట్లు,  బోధనారుసుములు రూ.450 కోట్లు ఎగ్గొట్టింది. ఈ ఏడాది విద్యాదీవెన పథకానికి చెల్లించాల్సిన మొత్తంలో రూ.120 కోట్లు కోతపెట్టింది. దీంతో సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు ఆయా విద్యాసంస్థలు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఆపేశాయి. ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిలిపేస్తూ జీవో 77 ఇచ్చారు. విదేశీవిద్య పథకం ద్వారా గత ప్రభుత్వం 4,923 మంది పేద విద్యార్థుల్ని విదేశాలకు పంపితే...జగన్‌ 116 మందినే పంపారు’’ అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని