BJP: జగన్.. చెల్లెలే మీ ఓటమిని కోరుకుంటున్నారు.. ఇక మిమ్మల్ని నమ్మేదెలా?: సత్యకుమార్

‘మీ చెల్లెలే మీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదంటున్నారు. పొరపాటున మీరు (జగన్‌) మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకా కష్టాలు తప్పవంటున్నారు.

Updated : 02 Mar 2024 07:45 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘మీ చెల్లెలే మీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదంటున్నారు. పొరపాటున మీరు (జగన్‌) మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకా కష్టాలు తప్పవంటున్నారు. ప్రజాకోర్టే తన తండ్రి మరణంపై తీర్పివ్వాలని కోరుతున్నారు. ఆ విషయంలో మీ పాత్రపైనా విచారణ చేయాలని అడుగుతున్నారంటే.. మీ కుటుంబంలో మీపై ఉన్న నమ్మకం, విలువ ఎంతో అందరికీ తెలుస్తోంది’ అని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. ‘మాట్లాడితే నా అక్కచెల్లెమ్మలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్‌.. సొంత బాబాయి కుటుంబానికే న్యాయం చేయలేదు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం మేలు చేస్తారు? జగన్‌ అధికారంలోకి వచ్చి అయిదేళ్లు గడుస్తున్నా వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో తేల్చకపోగా.. దర్యాప్తు సంస్థల విచారణను అడ్డుకుంటూ నిందితులను కాపాడుతున్నారు’ అని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా సత్యకుమార్‌ ఆరోపించారు.

కబ్జా భూముల చట్టబద్ధతకే ‘టైటిలింగ్‌ యాక్ట్‌’

‘తమ నేతలు కబ్జా చేసిన భూములను చట్టబద్ధం చేసుకోవడానికే వైకాపా ప్రభుత్వం ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ లాంటి భయంకరమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వైకాపా నాయకుల భూదాహానికి అంతే లేదు. సామాన్యులు, ప్రైవేటు, ప్రభుత్వ భూములే కాకుండా.. సీఎం సొంత జిల్లా కడపలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటి దళిత శాసనసభ్యుడు స్వర్ణ నాగయ్య భూమిని కూడా కబ్జా చేసేశారు’ అని ఆరోపించారు. ‘రుషికొండపై రూ.500 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారో.. ఎవరి కోసం నిర్మిస్తున్నారో వాటిని ప్రారంభించిన మంత్రులకు కూడా తెలియకపోవడం విడ్డూరం. రాజధాని ఎందుకు మార్చాల్సి వచ్చిందో తుగ్లక్‌ కనీసం తన ప్రజలకు చెప్పారు. కానీ జగన్‌ తుగ్లక్‌ను మించిపోయారు. ఒకప్పుడు ఏపీ.. దేశ కీర్తికిరీటంలో కలికితురాయి. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి’ అని సత్యకుమార్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని