MP Raghurama: బాబాయ్‌ను ఎవరు చంపారో అందరికీ తెలుసు.. సీబీఐకి తప్ప: ఎంపీ రఘురామ ఎద్దేవా

హూ కిల్డ్‌ బాబాయ్‌ అన్నది ఒక్క సీబీఐకి తప్ప రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రం సంధించారు. ఎవరు చంపారో అందరికీ తెలిసినప్పటికీ, అందరూ నటిస్తూనే ఉన్నారని విమర్శించారు.

Updated : 02 Mar 2024 08:46 IST

ఈనాడు, దిల్లీ: హూ కిల్డ్‌ బాబాయ్‌ అన్నది ఒక్క సీబీఐకి తప్ప రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రం సంధించారు. ఎవరు చంపారో అందరికీ తెలిసినప్పటికీ, అందరూ నటిస్తూనే ఉన్నారని విమర్శించారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హంతకులు నడిపే పార్టీకి ఓటేయొద్దని కోరడం ద్వారా సునీతారెడ్డి తన తండ్రిని ఎవరు చంపారో చెప్పకనే చెప్పారని పేర్కొన్నారు. అలాగే తాను కూడా ఫలానా వ్యక్తి హత్య చేశారని చెప్పనన్నారు. ‘వివేకాను ఎవరు చంపారో, సుపారీనిచ్చి చంపించారో బహిరంగ రహస్యమే. ఇప్పటివరకు న్యాయస్థానాల్లో పోరాడిన సునీత ఇప్పుడు ప్రజా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిన్నాన్నను చంపేశారని గతంలో బావురుమన్న జగన్‌.. స్వచ్ఛందంగా ముందుకొచ్చి సీబీఐ విచారణ ఎదుర్కోవాలి. హత్య జరిగిన రోజున హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు ఐదున్నర గంటలకు ఫోన్‌ వస్తే అది ఏడింటికి వచ్చినట్లు ఎందుకు నాటకాలాడారు? ఐదున్నర గంటలకే ఫోన్‌ వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయకల్లంరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ఆడియో కోర్టు వద్ద సాక్ష్యంగా ఉంది. ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్నది ఎవరు? పైకి రమ్మని పిలిచింది ఎవరు? ఆ ఫోన్‌ మాట్లాడాక కిందికి వచ్చిన జగన్‌.. ఎవరెవరికి ఫోన్‌ చేశారో వివరాలన్నీ ఉన్నాయి. సరైన సమయంలో అవన్నీ బయటకు వస్తాయి’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని