మోదీతోనే పేదలకు న్యాయం

ప్రధాని మోదీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Published : 02 Mar 2024 05:38 IST

ప్రజాహిత యాత్రలో బండి సంజయ్‌

కమలాపూర్‌, న్యూస్‌టుడే: ప్రధాని మోదీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన ప్రజాహిత యాత్ర శుక్రవారం హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌ మండల కేంద్రంలో కొనసాగింది. గ్రామంలోకి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, మహిళలు పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నివాసంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం రామాలయం కూడలిలో భారీగా తరలి వచ్చిన భాజపా కార్యకర్తలు, మహిళలనుద్దేశించి బండి సంజయ్‌ మాట్లాడారు. భారాస పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినా పేదలకు ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదన్నారు. ఎన్నికలకు ముందు అందరికీ రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రేషన్‌ కార్డు ఉన్నవారికే అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్‌ లోపు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని లేదంటే వదిలిపెట్టబోమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వం, విజిలెన్స్‌ నివేదికలు చెప్పాయని...కాంగ్రెసోళ్లు కేసీఆర్‌ మీద కేసు పెట్టకుండ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అందరూ కమలం గుర్తుకే ఓటేసి భాజపాను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో భాజపా నాయకులు విజయచందర్‌రెడ్డి, తుమ్మ శోభన్‌బాబు, అశోక్‌రెడ్డి, బి.ప్రవీణ్‌,  గౌతంరెడ్డి, మాట్ల రమేశ్‌, ఈటల భద్రయ్య, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని