పాత.. కొత్తల కలయిక

రాష్ట్రంలో పాత, కొత్త కలయికగా తొమ్మిది మందితో భాజపా లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదలైంది. ముగ్గురు సిటింగ్‌లకు, భారాస నుంచి తాజాగా పార్టీలో చేరిన ఇద్దరికి టికెట్లు దక్కాయి.

Updated : 03 Mar 2024 08:20 IST

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, అర్వింద్‌లకు పాత స్థానాలే
మల్కాజిగిరి నుంచి ఈటల - చేవెళ్లకు కొండా, భువనగిరికి బూర
హైదరాబాద్‌ నుంచి కొంపెల్ల మాధవీలత
భారాస నుంచి వచ్చిన భరత్‌కు నాగర్‌కర్నూల్‌లో, బీబీ పాటిల్‌కు జహీరాబాద్‌లో అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాత, కొత్త కలయికగా తొమ్మిది మందితో భాజపా లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదలైంది. ముగ్గురు సిటింగ్‌లకు, భారాస నుంచి తాజాగా పార్టీలో చేరిన ఇద్దరికి టికెట్లు దక్కాయి. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, సిటింగ్‌ ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, భాజపా కీలక నేత ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌కు పోటీకి అవకాశం లభించింది. హైదరాబాద్‌ నుంచి కొత్త అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు పార్టీ అవకాశం కల్పించింది. భాజపా గతం కంటే భిన్నంగా వ్యవహరించి ఎన్నికల షెడ్యూలు కంటే ముందే ఈసారి మొదటి జాబితాను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని జాతీయ నాయకత్వం ఆరంభం నుంచి పకడ్బందీగా వ్యవహరిస్తోంది. బలమైన అభ్యర్థులే లక్ష్యంగా భారాస నుంచి కీలక నేతలపై దృష్టి సారించి తదనుగుణంగా తొలివిడత అభ్యర్థులను ఖరారు చేసింది.

సిటింగ్‌ల వైపే మొగ్గు

ఆదిలాబాద్‌ మినహా సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లలో సిటింగ్‌ల వైపే భాజపా మొగ్గు చూపింది. సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. మల్కాజిగిరి టికెట్‌ కోసం పలువురు తీవ్రంగా పోటీ పడినా పార్టీ ముఖ్యనేత ఈటలకే అవకాశం దక్కింది. భాజపా మధ్యప్రదేశ్‌ ఇంఛార్జి మురళీధర్‌రావు, విద్యా సంస్థల అధినేత మల్క కొమరయ్య పేర్లను పరిశీలించినా వివిధ సమీకరణలతో ఈటల వైపే జాతీయ నాయకత్వం మొగ్గు చూపింది. చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బరిలోకి దించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినా ఆయన లోక్‌సభ స్థానానికే మొగ్గుచూపడంతో భాజపా ఆ దిశగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. గతంలో భారాస నుంచి భాజపాలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను భువనగిరి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ నుంచి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, పార్టీనేతలు మనోహర్‌రెడ్డి, శ్యాంసుందర్‌, కాసం వెంకటేశ్వర్లు పోటీపడినా సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీ బూర నర్సయ్యగౌడ్‌కు ప్రాధాన్యం ఇచ్చింది.

ఇలా చేరి.. అలా టికెట్‌

భాజపాలో చేరిన వెనువెంటనే టికెట్‌ పొందిన వారు ఇద్దరున్నారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి.రాములు; ఆయన కుమారుడు, జడ్పీటీసీ సభ్యుడు భరత్‌ ప్రసాద్‌ భారాసను వీడి గురువారమే భాజపాలో చేరారు. పార్టీ టికెట్‌ నేపథ్యంలోనే ఈ చేరికలు జరిగాయి. ఈ క్రమంలో ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన నాగర్‌కర్నూల్‌ నుంచి భరత్‌ ప్రసాద్‌ను పార్టీ బరిలోకి దించింది. జహీరాబాద్‌ సిటింగ్‌ ఎంపీ బి.బి.పాటిల్‌ శుక్రవారమే భారాసను వీడి భాజపాలో చేరారు. జహీరాబాద్‌ టికెట్‌ రేసులో ఇంకొందరు నిలిచినా మరో పరిశీలనకు అవకాశం లేకుండా పార్టీ.. పాటిల్‌ అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసింది.

పార్టీలో చేరక మునుపే...

విరించి హాస్పిటల్స్‌ ఫౌండర్‌ ఛైర్మన్‌ విశ్వనాథ్‌ సతీమణి, భరత నాట్య కళాకారిణి మాధవీలతను పార్టీ హైదరాబాద్‌ నుంచి పోటీకి నిలబెట్టింది. ఆమె లతామా ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ కూడా. పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. హిందుత్వం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అనర్గళంగా మాట్లాడే మాధవీలత త్వరలో పార్టీ సభ్యత్వం తీసుకుంటారని భాజపా వర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి భగవంత్‌రావు పేర్లు చర్చకు వచ్చినా మాధవీలత వైపు నాయకత్వం మొగ్గు చూపింది.

మిగిలిన ఎనిమిది లోక్‌సభ స్థానాలపై ఆచితూచి...

భాజపా సిటింగ్‌ స్థానమైన ఆదిలాబాద్‌, ముఖ్యనేతలు పోటీపడుతున్న మహబూబ్‌నగర్‌ సహా మిగిలిన ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, నల్గొండ, మెదక్‌, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆదిలాబాద్‌లో భాజపా సిటింగ్‌ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ అభ్యర్థిత్వాలను పార్టీ పరిశీలిస్తోంది. మరికొందరు నేతలు కూడా ఈ టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. మహబూబ్‌నగర్‌ టికెట్‌కోసం భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. నల్గొండ, ఖమ్మం టికెట్‌లపై వేచి చూసే ధోరణిలో పార్టీ వ్యవహరిస్తోంది. భారాస మాజీ ఎమ్మెల్యేను నల్గొండ నుంచి బరిలో దించేలా భాజపా ప్రయత్నిస్తోంది. ఖమ్మంలోనూ భారాస ముఖ్య నేతలపై దృష్టి పెట్టింది. మిగిలిన చోట బలమైన అభ్యర్థులను గుర్తించే పనిలో ఉంది.


తొలి జాబితా అభ్యర్థులు

కిషన్‌రెడ్డి, సికింద్రాబాద్‌

జి.కిషన్‌రెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కూడా. గత ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అంతకుముందు హిమాయత్‌నగర్‌ నుంచి ఒకసారి అంబర్‌పేట అసెంబ్లీ స్థానం నుంచి రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.


సంజయ్‌, కరీంనగర్‌

భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి అయిన బండి సంజయ్‌ 2019లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి మొదటిసారి ఎన్నికయ్యారు. 2018, 2023లో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.


అర్వింద్‌, నిజామాబాద్‌

ధర్మపురి అర్వింద్‌ 2019లో మొదటి సారి నిజామాబాద్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


ఈటల, మల్కాజిగిరి

భాజపా కీలకనేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ లోక్‌సభ అభ్యర్థిగా తొలిసారి బరిలోకి దిగుతున్నారు. 2004 నుంచి 2021 వరకు హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా గెలిచారు. నాలుగు సాధారణ ఎన్నికలు, 3 ఉపఎన్నికల్లో విజయం సాధించారు. భారాస నుంచి వరుసగా నెగ్గిన ఈటల 2021లో భాజపా నుంచి గెలిచారు. 2023 శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్‌, గజ్వేల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. భాజపాలో చేరికల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.


బీబీ పాటిల్‌, జహీరాబాద్‌

బీబీ పాటిల్‌ 2014, 2019లో జహీరాబాద్‌ నుంచి భారాస తరఫున లోక్‌సభ సభ్యుడిగా నెగ్గారు. తాజాగా భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.


మాధవీలత, హైదరాబాద్‌

తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న మాధవీలత లతామా ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో ఎనిమిది తొమ్మిదేళ్లుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


బూర నర్సయ్యగౌడ్‌, భువనగిరి

2014లో భారాస నుంచి లోక్‌సభకు ఎన్నికైన బూరనర్సయ్య గౌడ్‌ 2019లో ఓటమిపాలయ్యారు. మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో భాజపాలో చేరి తాజాగా భువనగిరి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.


కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల

2014లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి భారాస తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచారు.


పి.భరత్‌ ప్రసాద్‌, నాగర్‌కర్నూల్‌

సిటింగ్‌ ఎంపీ, మాజీ మంత్రి పి.రాములు కుమారుడు భరత్‌ ప్రసాద్‌, భారాస నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. తాజాగా లోక్‌సభ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని