వారణాసి నుంచే మోదీ పోటీ

లోక్‌సభ ఎన్నికలకు భాజపా సమరశంఖం పూరించింది. రికార్డు స్థాయిలో శనివారం 195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

Published : 03 Mar 2024 02:47 IST

గాంధీనగర్‌ నుంచి అమిత్‌షా.. లఖ్‌నవూ నుంచి రాజ్‌నాథ్‌
లోక్‌సభ ఎన్నికలకు 195 మందితో భాజపా తొలి జాబితా
తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
34 మంది కేంద్ర మంత్రులకు చోటు
33 మంది సిటింగ్‌లకు టికెట్‌ నిరాకరణ
దిల్లీ

లోక్‌సభ ఎన్నికలకు భాజపా సమరశంఖం పూరించింది. రికార్డు స్థాయిలో శనివారం 195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో కొందరు పాతవారిని తప్పించి, కొత్తవారికి అవకాశం కల్పించింది. ముందుగా భావించినట్లే వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, గాంధీనగర్‌ నుంచి అమిత్‌ షా, లఖ్‌నవూ నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌లే బరిలో నిలుస్తున్నారు. తొలి జాబితాలో 34 మంది మంత్రులకు చోటు దక్కింది. 16 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసిన భాజపా అధిష్ఠానం తెలంగాణలోని 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చోటు దక్కలేదు. ఇక్కడ పొత్తులపై చర్చలు జరుగుతున్నందునే ప్రకటించలేదని తెలుస్తోంది. శనివారం సాయంత్రం దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే జాబితాను విడుదల చేశారు. మరిన్ని రాష్ట్రాల్లో పార్టీ సత్తా చాటడానికి కృషి చేస్తున్నామని, ఎన్డీయేను విస్తరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

  • భాజపా తొలి జాబితాలో 28 మంది మహిళలు, 50 ఏళ్లలోపువారు 47 మంది ఉన్నారు.
  • ఎస్సీలకు 27, ఎస్టీలకు 18, ఓబీసీలకు 57 స్థానాలు దక్కాయి.
  • జాబితాలో ఇద్దరు మాజీ సీఎంలకు చోటు దక్కింది. మధ్యప్రదేశ్‌లోని విదిశ నుంచి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను, పశ్చిమ త్రిపుర నుంచి బిప్లవ్‌ దేవ్‌ను బరిలోకి దింపింది.
  • ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేఠీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీనే మళ్లీ పోటీకి నిలిపింది.
  • దివంగత నేత సుష్మా స్వరాజ్‌ కుమార్తె బాన్సురీ స్వరాజ్‌కు కొత్త దిల్లీ స్థానాన్ని కేటాయించింది.
  • లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి పోటీకి దిగుతున్నారు.
  • తొలి జాబితాలో చోటు దక్కించుకున్న మంత్రుల్లో మన్‌సుఖ్‌ మాండవీయ, జితేంద్ర సింగ్‌, సర్బానంద సోనోవాల్‌, గజేంద్ర శెఖావత్‌, భూపేందర్‌ యాదవ్‌, జి.కిషన్‌రెడ్డి, కిరణ్‌ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్‌ చంద్రశేఖర్‌, అర్జున్‌రాం మేఘ్‌వాల్‌, అర్జున్‌ ముండా తదితరులున్నారు.
  • భోజ్‌పురి సింగర్‌, నటుడు పవన్‌ సింగ్‌ను పశ్చిమ బెంగాల్‌లోని అసాన్‌సోల్‌ నుంచి భాజపా బరిలోకి దింపుతోంది.
  • పార్టీలో చేరిన బీఎస్పీ మాజీ ఎంపీ రితేశ్‌ పాండేకు అంబేడ్కర్‌ నగర్‌ టికెట్‌ను కేటాయించింది
  • నటి హేమమాలిని మళ్లీ మథుర నుంచే పోటీచేయబోతున్నారు.
  • కేరళలోని త్రిశూర్‌ నుంచి నటుడు సురేశ్‌ గోపీ బరిలోకి దిగుతున్నారు.
  • ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఏడుగురు మంత్రులు లోక్‌సభ బరిలో నిలిచారు.

అజయ్‌ మిశ్రకు మళ్లీ టికెట్‌

లఖింపుర్‌ ఖేరీలో రైతుల ఆందోళనలపై కారుతో దూసుకెళ్లి నలుగురి మరణానికి కారణమైన ఆశిష్‌ మిశ్ర తండ్రి, కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రకు జాబితాలో చోటు దక్కింది. ఆయన మళ్లీ ఖేరీ నుంచే పోటీచేయనున్నారు.

33 మంది సిటింగ్‌లకు టికెట్ల నిరాకరణ

భాజపా శనివారం ప్రకటించిన తొలి జాబితాలో 33 మంది సిటింగులకు టికెట్లను నిరాకరించింది. అస్సాంలో ఐదుగురిని, ఛత్తీస్‌గఢ్‌లో నలుగురిని, దిల్లీలో నలుగురిని, గుజరాత్‌లో ఐదుగురిని, ఝార్ఖండ్‌లో ఇద్దరిని, మధ్యప్రదేశ్‌లో ఏడుగురిని మార్చింది. మిగిలిన రాష్ట్రాల్లోనూ కొన్ని స్థానాల్లో సిటింగ్‌లను కాదని కొత్త వారికి అవకాశమిచ్చింది. ఝార్ఖండ్‌లో భాజపా మాజీ నేత యశ్వంత్‌ సిన్హా కుమారుడు జయంత్‌కు టికెట్‌ ఇవ్వలేదు. అదే రాష్ట్రంలో 3 సార్లు ఎంపీగా పనిచేసిన సుదర్శన్‌ భగత్‌కు టికెట్‌ నిరాకరించింది. దిల్లీలో రమేశ్‌ బిధూరీ, పర్వేశ్‌ వర్మ, మీనాక్షి లేఖి, హర్షవర్ధన్‌లకు టిక్కెట్లు దక్కలేదు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ ఎంపీగా ఉన్న సాధ్వి ప్రజ్ఞా ఠాకుర్‌కు అధిష్ఠానం టికెట్‌ను నిరాకరించింది.


రాష్ట్రాల వారీగా అభ్యర్థుల ప్రకటన ఇలా..

అండమాన్‌ నికోబార్‌-1, అరుణాచల్‌ ప్రదేశ్‌-2, అస్సాం-11, ఛత్తీస్‌గఢ్‌-11, దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ అండ్‌ దమణ్‌ దీవ్‌-1, దిల్లీ-5, గోవా-1, గుజరాత్‌-15, జమ్మూ కశ్మీర్‌-2, ఝార్ఖండ్‌-11, కేరళ-12, మధ్యప్రదేశ్‌-24, రాజస్థాన్‌-15, తెలంగాణ-9, త్రిపుర-1, ఉత్తరాఖండ్‌-3, ఉత్తర్‌ప్రదేశ్‌-51, పశ్చిమ బెంగాల్‌-20.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని