ఎమ్మెల్యే కోన దోపిడీపై.. వైకాపా పెద్దలకు చెప్పినా స్పందన లేదు

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అయిదేళ్లుగా చేసిన అవినీతి, అక్రమాలపై పార్టీపెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేదని వైకాపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముప్పిరి రాజశేఖరబాబు ఆవేదన వెలిబుచ్చారు.

Updated : 03 Mar 2024 08:53 IST

అవమానాలు తట్టుకోలేకే పార్టీని వీడుతున్నా
వైకాపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖరబాబు

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అయిదేళ్లుగా చేసిన అవినీతి, అక్రమాలపై పార్టీపెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేదని వైకాపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముప్పిరి రాజశేఖరబాబు ఆవేదన వెలిబుచ్చారు. ఎమ్మెల్యే అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకు మూడేళ్లుగా పార్టీలో తనను పక్కనపెట్టి అవమానిస్తున్నారని, కోన వైఖరితో విసిగిపోయి పార్టీని వీడుతున్నట్లు శనివారం సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కోన రఘుపతి విజయం కోసం కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అంబేడ్కర్‌ భవన్లు నిర్మించి, పాతవాటిని బాగుచేసి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటుచేసి దళిత యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. పురపాలక కార్యాలయం వద్ద తొలగించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్ఠించాలని కోరినందుకు పార్టీలో తనను పక్కన పెట్టారన్నారు. బాపట్ల లోక్‌సభ సీటును ఎస్సీలకు రిజర్వు చేయటం దురదృష్టకరమని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తాను ఖండించానని.. దాన్ని మనసులో పెట్టుకొని అవమానాలకు గురిచేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే కోన అహంకారం, పక్షపాత బుద్ధితో ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా వైకాపాను వీడుతున్నట్లు ఆ వీడియోలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని