East Godavari: వైకాపా కానుకలు.. అడ్డుకున్న తెదేపా శ్రేణులు

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక సచివాలయంలో వైకాపా నాయకులు కానుకలు పంపిణీ చేస్తుండగా తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు.

Updated : 06 Mar 2024 08:34 IST

పంపిణీకి సర్క్యులర్‌ ఉందన్న పంచాయతీ కార్యదర్శి

సీతానగరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక సచివాలయంలో వైకాపా నాయకులు కానుకలు పంపిణీ చేస్తుండగా తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు. రాజానగరం వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి రాజశ్రీ ఆధ్వర్యంలో.. సచివాలయ ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు వీటిని అందిస్తున్నారు. కొద్దిరోజులుగా రాజానగరం నియోజకవర్గంలో ‘వాలంటీర్లకు పురస్కారాల’ పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ తాయిలాలు ఇస్తున్నారు. మంగళవారం బొబ్బిల్లంకలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై తెదేపా వర్గీయులు, పంచాయతీ వార్డు సభ్యులు పోలిన శ్రీదేవి, పెండ్యాల మోహన్‌ నిలదీశారు. కానుకల సంచులపై సీఎం జగన్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫొటోలు ఉండటంపై పంచాయతీ కార్యదర్శి సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ సర్క్యులర్‌ ఉందని, ఎంపీడీవో సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు రావడంతో సర్పంచి నేతృత్వంలో ఏర్పాటు చేశామని కార్యదర్శి మహ్మద్‌ రజాక్‌ సమాధానమిచ్చారు. సర్క్యులర్‌ చూపించాలని తెదేపా నాయకులు పెండ్యాల అవిస్వామి, పోలిన కృష్ణ అడగ్గా.. సర్క్యులర్‌ తన వద్ద లేదని సాయంత్రం ఇస్తానంటూ కార్యదర్శి చెప్పారు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో అసహనానికి గురైన ఆయన ఎన్నికల కోడ్‌ ఇంకా రాలేదని అనడంపై పంచాయతీ పాలకవర్గ సభ్యులు మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని