డిపాజిట్‌ గల్లంతైనా పోటీకి సై

లోక్‌సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు.

Updated : 20 Mar 2024 06:28 IST

లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా 71,246 మందికి దక్కని ధరావతు
2019లో 86% మందికి నిరాశే

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. అంటే పోటీ చేసిన నియోజకవర్గంలో మొత్తం పోలైన చెల్లిన ఓట్లలో 6వ వంతు రాలేదని అర్థం. 2019లో 86శాతం అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. అభ్యర్థుల అనుచిత పోటీని నివారించేందుకు సెక్యూరిటీ డిపాజిట్‌ సొమ్మును పెంచినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.

  • 1951 నుంచి ఇప్పటిదాకా మొత్తం 91,160 మంది అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో 71,246 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇది 78శాతంతో సమానం.
  • మొదట్లో అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్‌ జనరల్‌ కేటగిరీ వారికి రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 ఉండేది. దీంతో ఎవరుపడితే వారు నామినేషన్‌ వేసేవారు. దీనిని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం డిపాజిట్‌ను పెంచింది. జనరల్‌ కేటగిరీ వారికి   రూ.25,000, ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500గా చేసింది.
  • 2019 ఎన్నికల్లో బీఎస్పీ 383 సీట్లలో పోటీ చేసింది. అందులో 345 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది.
  • గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 421 చోట్ల పోటీ చేయగా 148 చోట్ల డిపాజిట్లను దక్కించుకోలేకపోయింది.
  • 2019లో 49 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ 41 చోట్ల డిపాజిట్లను కోల్పోయింది.
  • 1951-52లో మొత్తం 1,874 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 745 మంది (40శాతం) డిపాజిట్లను దక్కించుకోలేదు.
  • 1996లో జరిగిన 11వ లోక్‌సభ ఎన్నికల్లో 13,952 మంది పోటీ చేశారు. వారిలో అత్యధికంగా 12,688 మంది (91శాతం) డిపాజిట్లు కోల్పోయారు. ఈ ఎన్నికల్లోనే అత్యధికంగా బరిలో నిలిచారు.
  • 1991-92లో 8,749 అభ్యర్థులు పోటీ చేయగా 7,539 మంది (86శాతం) డిపాజిట్లను  దక్కించుకోలేదు.
  • 2009లో 8,070 మంది పోటీ చేయగా 6,829 మంది (85శాతం) డిపాజిట్లను  కోల్పోయారు.
  • 2014 లోక్‌సభ ఎన్నికల్లో 8,251 మంది పోటీ చేశారు. వారిలో 7,000 మంది (84శాతం) డిపాజిట్లను దక్కించుకోలేదు.

జాతీయ పార్టీలు మేలే

  • జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది డిపాజిట్‌ దక్కించుకుంటున్నారు.
  • 1951-52లో జాతీయ పార్టీల నుంచి 1,217 మంది పోటీ చేశారు. అందులో కేవలం 344 మందే (28శాతం) డిపాజిట్లను కోల్పోయారు.
  • 1957లో 919 మంది అభ్యర్థులు జాతీయ పార్టీల నుంచి పోటీ చేశారు. వారిలో 130 మందికే (14శాతం) డిపాజిట్లు దక్కలేదు.
  • 1977లో జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలు అత్యుత్తమంగా నిలిచాయి. ఆ ఎన్నికల్లో 1,060 మంది పోటీ చేయగా 100 మందే (9శాతం) డిపాజిట్లను దక్కించుకోలేదు.
  • 2009లో జాతీయ పార్టీల తరఫున అత్యంత చెత్త రికార్డు నమోదైంది. మొత్తం 1,623 మంది పోటీ చేయగా 779 మంది (దాదాపు 40శాతంపైగా) డిపాజిట్లు కోల్పోయారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు