మూడంచెల వ్యూహం..14 సీట్లే లక్ష్యం

పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కచ్చితంగా 14 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌.. ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్‌ బూత్‌ స్థాయుల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించాలని పీసీసీ తాజాగా నిర్ణయించింది.

Published : 23 Mar 2024 05:35 IST

లోక్‌సభ, అసెంబ్లీ, పోలింగ్‌ బూత్‌ స్థాయిలో సమన్వయ కమిటీలు
ప్రతి పోలింగ్‌ బూత్‌ కమిటీలో ఐదుగురు కీలక సభ్యులు
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ కసరత్తు
ముఖ్యనేతలతో సమావేశమై చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కచ్చితంగా 14 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌.. ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్‌ బూత్‌ స్థాయుల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించాలని పీసీసీ తాజాగా నిర్ణయించింది. లోక్‌సభ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ పరిశీలకులతోపాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్యే లేదా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ప్రతి మండలం నుంచి ముఖ్యనేతలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పోలింగ్‌ బూత్‌స్థాయి కమిటీలో దాని పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులు ఐదుగురికి అవకాశం కల్పిస్తారు.  ఈ ఐదుగురే ఈసారి పోలింగ్‌ వరకూ గ్రామాల్లో అత్యంత కీలక పాత్ర పోషించాలని పార్టీ నిర్దేశించింది. ఎన్నికలకు వీరే సైనికులుగా నిలబడాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం తన నివాసంలో ప్రత్యేకంగా అంతర్గత సమావేశం నిర్వహించారు. ఎన్నికలయ్యేంత వరకు రాష్ట్ర ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని, కార్యకర్తల వెన్నంటి ఉండాలని సీఎం సూచించారు. 2019లో తనకు విజయం తెచ్చిపెట్టిన మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించిన మోడల్‌ను రాష్ట్రమంతటా అమలుచేయాలని ఇప్పటికే పార్టీ ముఖ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా ఒకట్రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్టీ అభ్యర్థికి పోలయ్యే ఓట్ల సంఖ్య.. పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యుల పనితీరుకు ప్రాతిపదికగా ఉంటుందన్నారు. పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన బూత్‌ కమిటీ సభ్యులకు భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. పనితీరునుబట్టి త్వరలో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.

చేరికలపై దృష్టి..

ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు తమ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేలు విజయం సాధించని నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఆ లోటు కనపడకుండా ఉండేలా పార్టీ ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ శుక్రవారం జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. విజయలక్ష్మి త్వరలోనే చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నగరంలోని పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని నేతలు గుర్తుచేస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మల్కాజిగిరిలో విజయం సాధించాలని కాంగ్రెస్‌ ప్రత్యేక వ్యూహరచన చేస్తోంది. భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుని సికింద్రాబాద్‌ అభ్యర్థిగా నిలబెట్టడం పార్టీ వ్యూహంలో భాగమేనని నేతలు చెప్పారు. నగరంలోని మరికొందరు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

అసంతృప్తి లేకుండా...

నాగర్‌కర్నూల్‌ టికెట్‌ తనకు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఇటీవలే పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఇంటికి ఆ నియోజకవర్గ అభ్యర్థి మల్లు రవి శుక్రవారం వెళ్లారు. తనకు సహకారం అందించాలని మల్లు రవి కోరగా.. సంపత్‌కుమార్‌ అంగీకరించారు. మల్లు రవిని సాదరంగా ఆహ్వానించి సంపత్‌ శాలువాతో సన్మానించారు.  అనంతరం వారు సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. మంత్రి జూపల్లి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారితో సుదీర్ఘంగా చర్చించిన సీఎం నాగర్‌కర్నూల్‌లో విజయం సాధించేందుకు దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని