అసెంబ్లీ బరిలో.. ఆరుగురు మాజీ సీఎంల కుమారులు

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేల వారసులు పోటీ చేయడం సహజమే. ముఖ్యమంత్రి, మాజీ సీఎంల కుమారులూ ఒకరిద్దరు రంగంలో ఉంటారు.

Published : 23 Mar 2024 05:35 IST

లోక్‌సభ స్థానాలకు పోటీ ప్రయత్నాల్లో ఇద్దరు కుమార్తెలు?

ఈనాడు-అమరావతి: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేల వారసులు పోటీ చేయడం సహజమే. ముఖ్యమంత్రి, మాజీ సీఎంల కుమారులూ ఒకరిద్దరు రంగంలో ఉంటారు. ఈ దఫా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏకంగా ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో నిలుస్తుండడం విశేషం. మరో ఇద్దరు మాజీ సీఎంల కుమార్తెలు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే ప్రయత్నాల్లో ఉన్నారు.  

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్‌ పులివెందుల నుంచి బరిలో నిలిచారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన అక్కడ నుంచి గెలుపొందారు.
  • మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడైన నారా లోకేశ్‌ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనుమడు అయిన లోకేశ్‌.. గత తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.
  • మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం అసెంబ్లీ బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు విజయం సాధించారు. గతంలో హిందూపురం నుంచి ఆయన సోదరుడు నందమూరి హరికృష్ణ కూడా గెలుపొందారు.
  • జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెనాలి నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్నాళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన నాదెండ్ల భాస్కరావుకు కుమారుడైన ఈయన గతంలో తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌గానూ వ్యవహరించారు. ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు కూడా 1989లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు సీఎంగా సేవలందించిన కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా డోన్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన మూడుసార్లు(ఉప ఎన్నికతో కలిపి) లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ పని చేశారు.
  • వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తండ్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పని చేశారు.

ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె పురందేశ్వరి గతంలో బాపట్ల, విశాఖపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఆమె ఈ దఫా ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ సోదరి అయిన వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని