2004 చరిత్ర పునరావృతం: జైరాం రమేశ్‌

రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్న భాజపా వాదనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తోసిపుచ్చారు.

Published : 23 Mar 2024 05:18 IST

దిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్న భాజపా వాదనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తోసిపుచ్చారు. ‘టైగర్‌ మే అభీ బహుత్‌ జాన్‌ హై’ (పులిలో ఇంకా చాలా దమ్ముంది) అని పేర్కొన్న ఆయన.. విపక్ష కూటమి 2004 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తుందన్నారు. ఆ ఎన్నికల్లో ‘ఇండియా షైనింగ్‌’ అంటూ బరిలోకి దిగిన భాజపా అధికారం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ‘అయిదు న్యాయాలు’, ‘25 గ్యారంటీలు’తో కాంగ్రెస్‌ బరిలోకి దిగుతోందని.. విపక్ష ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ రావడం ఖాయమన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘2003 ఎన్నికల్లోనూ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. భాజపా ‘ఇండియా షైనింగ్‌’ అంది. 2004లో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఇపుడు 20 ఏళ్ల తర్వాత అదే చరిత్ర పునరావృతం అవుతుంది’’ అన్నారు. కాగా, శుక్రవారం మళ్లీ సమావేశమైన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ తమిళనాడులో డీఎంకేతో పొత్తులో భాగంగా తమ కోటా కింద వచ్చిన 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరిపింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని