వరంగల్‌కు అరూరి.. ఖమ్మంకు వినోద్‌రావు

వరంగల్‌, ఖమ్మం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను భాజపా ఖరారు చేసింది. ఊహించినట్లే.. ఇటీవలే భారాస నుంచి భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్‌ టికెట్‌ దక్కింది.

Updated : 28 Mar 2024 16:35 IST

భాజపా అభ్యర్థుల ప్రకటన
జలగం వెంకట్రావుకు నిరాశే
రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఖరారు
వారిలో నలుగురు సిటింగ్‌ ఎంపీలు, నలుగురు మాజీ ఎంపీలు.. ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌, ఖమ్మం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను భాజపా ఖరారు చేసింది. ఊహించినట్లే.. ఇటీవలే భారాస నుంచి భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్‌ టికెట్‌ దక్కింది. ఖమ్మం అభ్యర్థిగా పార్టీ నేత తాండ్ర వినోద్‌రావు పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఈ టికెట్‌ను ఇటీవల భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు ఇస్తారనే చర్చ జరిగింది. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలో ముందు నుంచీ ఉన్న నేతలు వ్యతిరేకించడంతో పాటు ఇతర అంశాలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో పార్టీ నుంచి బలమైన నేతను చేర్చుకుని టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరిగినా ఆ ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంతో వినోద్‌రావుకు కేటాయించినట్లు తెలిసింది.

భారాస నుంచి చేరిన వారికి పెద్దపీట

వరంగల్‌, ఖమ్మం టికెట్ల కేటాయింపుతో రాష్ట్రంలోని అన్ని (17) లోక్‌సభ స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించినట్లయింది. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపే లక్ష్యంలో భాగంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తూనే భారాస నుంచి చేరిన నేతలకు పెద్దపీట వేసింది. ఆ పార్టీ నుంచి వచ్చిన ఆరుగురికి టికెట్లు దక్కగా... కాంగ్రెస్‌ నుంచి చేరిన ఒకరికి పోటీకి అవకాశం లభించింది. భారాస నుంచి చేరిన వారిలో.. సిటింగ్‌ ఎంపీ బి.బి.పాటిల్‌కు జహీరాబాద్‌.. మాజీ ఎంపీల్లో గోడం నగేశ్‌కు ఆదిలాబాద్‌, సీతారాం నాయక్‌కు మహబూబాబాద్‌.. మాజీ ఎమ్మెల్యేల్లో శానంపూడి సైదిరెడ్డికి నల్గొండ, అరూరి రమేశ్‌కు వరంగల్‌.. సిటింగ్‌ ఎంపీ కె.రాములు కుమారుడు భరత్‌ ప్రసాద్‌కు నాగర్‌కర్నూల్‌ టికెట్‌ దక్కగా.. కాంగ్రెస్‌ నుంచి చేరిన గోమాసె శ్రీనివాస్‌కు పెద్దపల్లి టికెట్‌ లభించింది. భాజపాకు రాష్ట్రంలో నలుగురు సిటింగ్‌ ఎంపీలు ఉండగా.. వారిలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుకు మాత్రం ఈసారి అవకాశం దక్కలేదు. భాజపా అభ్యర్థుల్లో నలుగురు సిటింగ్‌ ఎంపీలు కాగా.. మరో నలుగురు మాజీ ఎంపీలు, ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి, ఖమ్మంలలో మాత్రం కొత్త అభ్యర్థులు బరిలో దిగనున్నారు.

అభ్యర్థుల ఖరారులో వ్యూహం

లోక్‌సభ అభ్యర్థులను ముందే ప్రకటించడం ద్వారా భాజపా ముందస్తు వ్యూహంతో వ్యవహరించింది. అగ్రనేతల ప్రచారానికీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ప్రధాని మోదీ రెండు విడతలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్‌, మెదక్‌ (పటాన్‌చెరు), జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ బహిరంగ సభలతో పాటు మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. అమిత్‌షా కూడా హైదరాబాద్‌లో పార్టీ శ్రేణులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే అభ్యర్థులుగా ఖరారైనవారు క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు.


ఇదీ నేపథ్యం..

అరూరి రమేశ్‌: 2014, 2018లలో భారాస తరఫున వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల భాజపాలో చేరారు.

తాండ్ర వినోద్‌రావు: ఈయనది అశ్వారావుపేట నియోజకవర్గం. సామాజిక సేవకులు. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్‌ కృషి విజ్ఞాన కేంద్రం మాజీ ఛైర్మన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని