ప్రతి పోలింగ్‌ బూత్‌లో 370 ఓట్లు లక్ష్యం

ప్రజల్లో భాజపాకు ఉన్న సానుకూల ధోరణిని ఓట్లుగా మలచుకుని మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని భాజపా రాష్ట్ర నాయకత్వం పార్టీ శ్రేణులకు నిర్దేశించింది.

Updated : 25 Mar 2024 06:14 IST

ఒక్కో ఓటర్ని మూడుసార్లు కలవాలి
లోక్‌సభ ఎన్నికలకు భాజపా 50 రోజుల కార్యాచరణ
అభ్యర్థులు, పదాధికారులు, ఎన్నికల నిర్వహణ కమిటీలకు దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజల్లో భాజపాకు ఉన్న సానుకూల ధోరణిని ఓట్లుగా మలచుకుని మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని భాజపా రాష్ట్ర నాయకత్వం పార్టీ శ్రేణులకు నిర్దేశించింది. ఎన్నికల్లోపు ఇంటింటికీ మూడుసార్లు వెళ్లడంతో పాటు ప్రతి ఓటర్ని మూడుసార్లు కలవడం లక్ష్యంగా పెట్టుకోవాలంది. లోక్‌సభ ఎన్నికలకు 50 రోజుల కార్యాచరణను నాయకత్వం వివరించింది. ‘ఇదే సమయం.. సరైన సమయం’ అని పార్టీ శ్రేణులు గుర్తించాలంది. ప్రతి పోలింగ్‌ బూత్‌ నుంచి 370 కంటే ఎక్కువ ఓట్లు సాధించేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలంది. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నేతృత్వంలో కీలక సమావేశాలు జరిగాయి. లోక్‌సభ అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా సమావేశమైంది. రాష్ట్ర పదాధికారులు, ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చేరికలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ నేతలు ముందుకు వెళ్లాలన్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఇన్‌ఛార్జులు సునీల్‌బన్సల్‌, చంద్రశేఖర్‌ తివారి, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, ముఖ్యనేతలు ఈటల రాజేందర్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శాసనసభాపక్షనేత మహేశ్వర్‌రెడ్డి, లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన నేతలు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

కలసికట్టుగా ముందుకెళ్లండి

‘‘విజయమే లక్ష్యంగా అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సహకరించాలి. అభ్యర్థులు కూడా లోక్‌సభ స్థానం పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో కలసికట్టుగా ముందుకు వెళ్లాలి. మండలాలు, నియోజకవర్గాల వారీగా కార్యాచరణను రూపొందించుకుని ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. జాతీయ నాయకులు, రాష్ట్రస్థాయి నేతల సభలు అన్ని ప్రాంతాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటుచేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను అభ్యర్థులకు అందజేస్తాం. వీటి ఆధారంగా లబ్ధిదారులను కలసి పథకాల గురించి వివరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకుంటూ వ్యతిరేక ప్రచారాలను దీటుగా ఎదుర్కోవాలి. జనసంపర్క్‌ అభియాన్‌ లక్ష్యంగా ఉండాలి. సామాజిక వర్గాల ముఖ్యనేతలతో భేటీ అవ్వాలి. శక్తి కేంద్రాల వారీగా సమావేశాలు జరపాలి. త్వరలోనే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయనున్నాం’’ అని సమావేశాల్లో నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెలరోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను తెలియజేశారు.

ప్రతి ఓటర్ని కలుస్తాం: మహేశ్వర్‌రెడ్డి

ప్రతి ఓటర్ని కలవడమే లక్ష్యంగా భాజపా కార్యాచరణను సిద్ధం చేసినట్లు పార్టీ శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సమావేశాల అనంతరం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మే ఆరో తేదీన టిఫిన్‌ బైఠక్‌ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ ఇది జరుగుతుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100, 200 మందితో కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కమిటీ మూడు రోజులకు ఒకసారి సమావేశమై చర్చిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.


సానుకూల వాతావరణం: కిషన్‌రెడ్డి

‘‘తెలంగాణలో భాజపాకు సానుకూల వాతావరణం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.. కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేసినా, డబ్బులు ఖర్చుపెట్టినా భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయం. ప్రజలంతా మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మహిళలు స్వచ్ఛందంగా భాజపా కార్యక్రమాలకు వస్తున్నారు. ప్రతి బూత్‌కి ఒక ముఖ్యనేతను సమన్వయకర్తగా నియమించుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’’ అని సమావేశంలో కిషన్‌రెడ్డి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని