పది స్థానాలపై భాజపా గురి

లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా తెలంగాణలో పది లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తోంది.

Updated : 26 Mar 2024 06:20 IST

పార్టీ జాతీయ నాయకత్వం పర్యవేక్షణ
వ్యూహాత్మకంగా కొత్త అభ్యర్థుల ఎంపిక
ప్రచారంలోనూ ముందస్తు కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా తెలంగాణలో పది లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తోంది. శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ.. గత లోక్‌సభ ఫలితాలు ప్రాతిపదికగా మెజారిటీ స్థానాలపై ఆశావహ దృక్పథంతో ఉంది. సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ సిటింగ్‌ స్థానాలతో పాటు అదనంగా మరో ఆరు నియోజకవర్గాలపై పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించిన అధినాయకత్వం అభ్యర్థుల ఎంపికలోనూ అదే వ్యూహాన్ని అనుసరించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తయినందున మొదటి విడత ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ప్రధాని రెండు విడతలుగా ప్రచార సభల్లో పాల్గొనగా.. అగ్రనేత అమిత్‌షా పార్టీనేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంలోనూ భాజపా ప్రత్యేక పంథాలో సాగింది. ప్రధానంగా విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్తవారికి ప్రాధాన్యమిచ్చింది. ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు జాతీయ నాయకత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. ఇద్దరు భారాస సిటింగ్‌ ఎంపీలతో పాటు అదేపార్టీకి చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఒక లోక్‌సభ స్థానం మినహా అన్ని స్థానాల్లో లక్ష్యం మేరకు చేరికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు పార్టీనేతలు పేర్కొంటున్నారు.

టికెట్‌ల కేటాయింపులో సమీకరణాలు

భాజపా జాతీయ నాయకత్వం టికెట్‌ల కేటాయింపులోనూ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రెండు ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాల్లో కూడా గిరిజనుల్లో కీలకమైన రెండు వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది. భారాసకు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలను పార్టీలో చేర్చుకుని బరిలోకి దింపింది. ఆదిలాబాద్‌ స్థానం నుంచి సిటింగ్‌ ఎంపీని కాదని మాజీ ఎంపీ జి.నగేశ్‌ను పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇవ్వగా.. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం లో లంబాడాలకు ప్రాధాన్యమిస్తూ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ను పార్టీలోకి తీసుకుని బరిలోకి దింపింది. ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లోనూ ఇదే పంథాను అనుసరించింది. నాగర్‌కర్నూల్‌ రిజర్వుడ్‌ స్థానం నుంచి సిటింగ్‌ ఎంపీ రాములును పార్టీలో చేర్చుకుని ఆయన కుమారుడు భరత్‌ ప్రసాద్‌కు టికెట్‌ కేటాయించింది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం నుంచి కొత్త అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ను పోటీలో నిలిపింది. మరో ఎస్సీ రిజర్వుడ్‌ స్థానమైన వరంగల్‌లో కూడా భారాస మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను పార్టీలోకి తెచ్చుకుని టికెట్‌ ఇచ్చింది. ఇలా నాలుగు రిజర్వుడ్‌ స్థానాల్లోనూ ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న నేతలకే టికెట్‌లిచ్చింది. ఇతర స్థానాల్లోనూ పకడ్బందీగానే వ్యవహరించింది. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావులను లోక్‌సభ బరిలోకి దించింది. భారాస సిటింగ్‌ ఎంపీ బి.బి.పాటిల్‌ను పార్టీలో చేర్చుకుని జహీరాబాద్‌ అభ్యర్థిగా నిలిపింది. ఇక నియోజకవర్గ, మండల స్థాయి నేతల చేరికలపై దృష్టి సారించింది. ప్రధానంగా భారాస నేతలే లక్ష్యంగా ముందుకెళ్తోంది.


నోటిఫికేషన్‌కు ముందు అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్‌ రాక

లివిడత జాతీయ నేతల ప్రచారంపై రాష్ట్ర నాయకులు దృష్టి సారించారు. వారి ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ల బహిరంగ సభలను వేర్వేరు చోట్ల నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నోటిఫికేషన్‌ తర్వాత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు. ప్రచారంలో జాతీయ నేతల సభలతో పాటు క్షేత్రస్థాయిలో బూత్‌ నుంచి కార్యక్రమాల ఎజెండాను రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని