హైదరాబాద్‌ భారాస అభ్యర్థిగా శ్రీనివాస్‌ యాదవ్‌

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి భారాస అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు.

Updated : 26 Mar 2024 06:19 IST

రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక పూర్తి
ఎన్నికలకు శ్రేణుల సమాయత్తంపై కేసీఆర్‌ దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి భారాస అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌ సోమవారం హైదరాబాద్‌కూ ఖరారు చేయడంతో మొత్తం 17 స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల  కావడంతో.. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై అధినేత కేసీఆర్‌ దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం డీలాపడిన పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం నింపడంతో పాటు.. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని వీడిన ముఖ్య నాయకుల స్థానంలో కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించడంపైనా ఆయన కసరత్తు చేస్తున్నారు.  పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షల బాధ్యతలను కేటీఆర్‌, హరీశ్‌రావులకు అధినేత అప్పగించారు. ఇందులో భాగంగా సోమవారం వరంగల్‌ పరిధిలోని ముఖ్య నేతలతో హరీశ్‌రావు సమావేశమయ్యారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షను కేటీఆర్‌ నిర్వహించనుండగా.. మెదక్‌ పరిధిలోని సంగారెడ్డి, మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలతో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే భారీ బహిరంగ సభలతో పాటు.. రోడ్‌షోల్లోనూ కేసీఆర్‌ పాల్గొనడానికి వీలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని