6 లేదా 7న తుక్కుగూడలో జనజాతర సభ

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్‌ 6 లేదా 7న ‘జనజాతర’ పేరుతో భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ఆయన తెలిపారు.

Updated : 27 Mar 2024 06:10 IST

పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్‌ 6 లేదా 7న ‘జనజాతర’ పేరుతో భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయిలో ఇచ్చే గ్యారంటీ హామీలను ఈ సభలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే ప్రకటించుకున్నామని ఆయన గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి అక్కడి నుంచే శంఖం పూరించబోతున్నామన్నారు. జూబ్లీహిల్స్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో మంగళవారం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ స్థాయి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, చేవెళ్ల అభ్యర్థి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వికారాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీతోనే దేశంలో సామాజికన్యాయం సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 14 చోట్ల గెలవాలనే పట్టుదలతో ఉన్నాం. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు సేకరించి, పార్టీ నిర్వహించిన సర్వేల ఆధారంగానే అభ్యర్థులను అధిష్ఠానం ఎంపిక చేస్తోంది. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే చేవెళ్లలో రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరిలో సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది.

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు రాష్ట్రంలో వంద రోజుల కాంగ్రెస్‌ పరిపాలనకు రెఫరెండం. తెలంగాణలో 14 స్థానాలు గెలిచి సోనియా గాంధీకి కృతజ్ఞత తెలుపుదాం. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు ఏం చేశారు? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయలేదు. బుల్లెట్‌ రైలును గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీ.. వికారాబాద్‌కు కనీసం ఎంఎంటీఎస్‌ కూడా ఇవ్వలేదు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకున్న మోదీ.. హైదరాబాద్‌లో మూసీ తీర ప్రాంత అభివృద్ధికి నిధులివ్వలేదు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు రాకుండా భాజపా ఎందుకు మోకాలడ్డుతోంది? ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని ప్రజలను ఆ పార్టీ నాయకులు అడుగుతున్నారు? లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకుంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్‌ గాంధీ వేల కిలోమీటర్లు భారత్‌ జోడో యాత్ర చేశారు. పార్టీకి అందరూ అండగా నిలబడి సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరచాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్‌ను మోసం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే తమలాంటి వారికి నష్టం జరుగుతుందన్నారు. సీఎంతో తనకు సాన్నిహిత్యం లేదంటూ బయట ప్రచారం జరుగుతోందని, తాను ఎంత సన్నిహితుడనో ముఖ్యమంత్రే చెప్పాలని ఆయన అన్నారు. చేవెళ్లలో అందరం కలసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని