8 మంది ఎవరో?

లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌.. మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది.

Published : 27 Mar 2024 06:10 IST

నేటి సీఈసీ సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల ఖరారు
దిల్లీకి వెళ్లనున్న రేవంత్‌, భట్టి, ఉత్తమ్‌
సీఎం నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీ భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌.. మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం బుధవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. దీనికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, సీఈసీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 9 మంది అభ్యర్ధులను ప్రకటించిన సీఈసీ.. మిగిలిన వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. మెదక్‌, భువనగిరి, వరంగల్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించాల్సి ఉంది.

స్క్రీనింగ్‌ కమిటీలో ఏకాభిప్రాయం!

సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం రాత్రి పార్టీ రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. మొత్తం 8 స్థానాల్లోనూ ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనే అంశంపై ఇందులో దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. వీటిలో ఆదిలాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్‌ స్థానానికి డాక్టర్‌ సుమలత లేదా ఉపాధ్యాయురాలు సుగుణ పేర్లను సీఈసీకి పంపనున్నారు. వరంగల్‌ టికెట్‌ను ఎస్సీ మాదిగవర్గం నేతకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(పీఈసీ) డి.సాంబయ్య పేరును ప్రతిపాదించింది. భువనగిరి టికెట్‌ను తన సతీమణి లక్ష్మికి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నారు. కానీ, పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును పీఈసీ ప్రతిపాదించింది. కేంద్ర ఎన్నికల కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కరీంనగర్‌కు తీన్మార్‌ మల్లన్న లేదా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్లు ఖరారు కావచ్చని అంచనా. ఖమ్మం సీటుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సతీమణి నందిని పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో టికెట్‌ ఎవరికివ్వాలనేది సీఈసీలోనే తేలనుంది. మెదక్‌లో భాజపా, భారాసలు జనరల్‌ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంతో.. బీసీ అభ్యర్థిని బరిలో దించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. పటాన్‌చెరుకు చెందిన నీలం మధు పేరును సీఈసీకి ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ప్రకటించాల్సిన స్థానాల్లో ఖమ్మం అభ్యర్థిత్వం బుధవారం తేలుతుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం మినహా మిగతా ఏడు సీట్లను బుధవారమే సీఈసీ ఖరారు అవకాశం లేకపోలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నేతలు ప్రతిపాదించినా సీఈసీ సమావేశంలో చివరి క్షణంలో మార్పులు, చేర్పులుండే అవకాశముందని నేతలు చెబుతున్నారు.

అనేక వడపోతల అనంతరం..

మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనీసం 14 గెలుపొందడమే లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఆశావహుల బలాబలాలను బేరీజు వేసి.. అనేక వడపోతల అనంతరం పలువురి పేర్లను సీఈసీకి పార్టీ రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీ ప్రతిపాదించింది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ కూడా క్షేత్రస్థాయి నేతల నుంచి వివరాలు సేకరించారు. ఎవరికి టికెట్‌ ఇస్తే కాంగ్రెస్‌ గెలుస్తుందనే అంశంపై అధిష్ఠానం ప్రైవేటు సంస్థలతో సర్వేలు చేయిస్తోంది. వాటి ఫలితాల ఆధారంగా రాష్ట్ర నేతలు ప్రతిపాదించిన పేర్లపై సీఈసీలో చర్చ జరుగుతుందని పార్టీవర్గాలు తెలిపాయి.


ప్రచార వ్యూహంపై చర్చించనున్న పీసీసీ

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాలను గెలుచుకునేందుకు అవలంబించాల్సిన ప్రచార వ్యూహంపై ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్‌లో పీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్‌ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 29న ఏర్పాటు చేసే సమావేశంతో పాటు ఎన్నికల ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మంగళవారం చర్చించారు. ఎన్నికల హడావుడి పెరుగుతుండటంతో సీఎం ఇకనుంచి తరచూ గాంధీభవన్‌కు వచ్చి నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని