వరుణ్‌గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన అధీర్‌ రంజన్‌

గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగానే ఎంపీ వరుణ్‌ గాంధీకి భాజపా టికెట్‌ నిరాకరించిందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఆరోపించారు.

Published : 27 Mar 2024 03:46 IST

బహరాంపుర్‌ (పశ్చిమబెంగాల్‌): గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగానే ఎంపీ వరుణ్‌ గాంధీకి భాజపా టికెట్‌ నిరాకరించిందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఆరోపించారు. ‘వరుణ్‌ విద్యావంతుడు, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ఒక దబాంగ్‌ నేత (బలమైన నాయకుడు). కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఆయన సోదరుడు కావడంతో సహజంగానే గాంధీ కుటుంబంతో అనుబంధం ఉంటుంది. అందుకే వరుణ్‌కు లోక్‌సభ ఎన్నికల్లో భాజపా టికెట్‌ నిరాకరించింది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని నేను అనుకుంటున్నాను. ఆయన కాంగ్రెస్‌లో చేరితే మేమెంతో సంతోషిస్తాం’ అని మంగళవారం అధీర్‌ పేర్కొన్నారు. చేరికపై వరుణ్‌తో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మారే అవకాశాలున్నట్లు ప్రచారం జోరందుకుంది. పీలీభీత్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన వరుణ్‌ గాంధీ కేంద్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయాలపై కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని గతేడాది ఆయన కేదార్‌నాథ్‌లో కలుసుకోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. భాజపాకు దూరంగా ఉంటున్న ఆయన.. పార్టీ మారే అవకాశం ఉందంటూ అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని