4 ఖరారు.. 4 పెండింగ్‌

రాష్ట్రంలో మరో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలకు అవకాశం కల్పించారు.

Updated : 28 Mar 2024 06:56 IST

ఖమ్మం నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేయాలని విన్నపం
ఆమె నిర్ణయం వెలువడిన తర్వాతే ఆ స్థానానికి అభ్యర్థి ప్రకటన
వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలకు ఇంకా కొలిక్కిరాని అభ్యర్థిత్వాలు

ఈనాడు, హైదరాబాద్‌, దిల్లీ: రాష్ట్రంలో మరో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలకు అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలు మినహా మిగతా వాటికి అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం దిల్లీలో సమావేశమై చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, గోవా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం గోవా మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లోని 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో జాబితాను పార్టీ విడుదల చేసింది.

తాజాగా ప్రకటించిన అభ్యర్థుల్లో జీవన్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న ఆయన పేరుపై సీఈసీలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. జీవన్‌రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థులు పార్లమెంటుకు పోటీచేయడం ఇదే తొలిసారి. నీలం మధు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు టికెట్‌ ఆశించినా చివరిక్షణంలో దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. బీసీ కోటాలో ఆయనను ఇప్పుడు మెదక్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఆత్రం సుగుణనే ఎంపిక చేసినా.. పొరపాటున తొలుత డాక్టర్‌ సుగుణకుమార్‌ చెలిమల అని జాబితాలో ప్రకటించి.. తర్వాత సవరించారు. సుగుణ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి భువనగిరి నుంచి అవకాశం ఇచ్చారు.

ప్రియాంక కోసమేనా...

ఖమ్మం స్థానం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  ప్రియాంకాగాంధీ పోటీచేయాలని రాష్ట్ర నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆమె ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెండోస్థానంగా ఖమ్మం నుంచి కూడా పోటీచేయడానికి సుముఖంగా ఉన్నారా? లేదా? అన్న దానిపై ఈ సమావేశంలో స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం కోసం ఖమ్మం అభ్యర్థి ఎంపికను పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ స్థానానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్‌లు పోటీపడుతున్నారు. అలాగే వ్యాపారవేత్త వీవీ రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకృష్ణలు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర నాయకత్వం ఇక్కడి నుంచి ప్రియాంకాగాంధీ పోటీచేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక పోటీ చేయకపోతే ప్రసాద్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయని నేతల అంచనా.

  • కరీంనగర్‌ నుంచి పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానానికి పోటీపడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రవీందర్‌రావు, తీన్మార్‌ మల్లన్న అభ్యర్థిత్వాలపై మరోసారి సర్వే నిర్వహించి ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నట్లు సమాచారం.
  • వరంగల్‌ స్థానానికి పీసీసీ.. సాంబయ్య పేరును ప్రతిపాదించినా అక్కడి నుంచి సిటింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, నెమిండ్ల శ్రీనివాస్‌, డాక్టర్‌ పరమేశ్వర్‌, పరికి సదానందం పేర్లపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సర్వే నిర్వహించి బలమైన అభ్యర్థిని ఎంపికచేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా  తెలిసింది.
  • హైదరాబాద్‌ టికెట్‌ మైనార్టీలకిస్తే మస్కతీ అలీని లేదంటే బీసీ నేతను త్వరలో ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని