ఎన్ని కుట్రలు చేసినా భాజపా, భారాసలు గెలవలేవు

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో మరోసారి ఘనవిజయం సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన భారాస, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం సీఎం నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు.

Published : 28 Mar 2024 03:29 IST

మల్కాజిగిరిలో ఎక్కువ మెజార్టీ సాధించాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో మరోసారి ఘనవిజయం సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన భారాస, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం సీఎం నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరిలో తనకు వచ్చిన దాని కంటే ఎక్కువ మెజార్టీతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ప్రజలను మభ్యపెట్టే చర్యలకు పాల్పడినా భాజపా, భారాసలు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలవలేవన్నారు. ఉనికి లేకుండా పోయే పార్టీలకు ఓట్లు వేసే బదులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రజలు బలపరచాలని కోరారు. ప్రజలతో మమేకమయ్యేలా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను ఎట్టిపరిస్థితుల్లో అమలు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో తమ అడ్రస్‌ గల్లంతవుతుందనే భయంతోనే భాజపా, భారాస నాయకులు కాంగ్రెస్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్టీలో చేరినవారిలో తెదేపా నేత కృష్ణప్రసాద్‌, తెలంగాణ కమ్మ సంఘం నాయకులు బి.రవిశంకర్‌, అరికెపూడి ప్రసాద్‌(మేడ్చల్‌), బోడు వెంకటేశ్‌యాదవ్‌(కుత్బుల్లాపూర్‌), మాజీ కార్పొరేటర్లు శాలిని, పావనీరెడ్డి, రమణారెడ్డి, మాజీ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

అండగా ఉంటా: వీహెచ్‌కు సీఎం హామీ

అన్ని విధాలుగా అండగా ఉంటానని మాజీ ఎంపీ వీహెచ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం టికెట్‌ ఆశించిన వీహెచ్‌.. తనకు వచ్చే అవకాశం లేదని భావించి కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీహెచ్‌ను సీఎం బుధవారం తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. అభ్యర్థుల ఖరారుకు పార్టీ అధిష్ఠానం అవలంబిస్తున్న విధానాన్ని వివరించారు. నాయకులందరం ఐక్యంగా ప్రచారానికి వెళ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, కాంగ్రెస్‌ ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి ఈ సందర్భంగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని