కరవును రాజకీయం చేస్తున్న భారాస

రాష్ట్రంలో కరవు పరిస్థితులను భారాస రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని, కరవుకు కాంగ్రెస్‌ కారణం కాబోదనే విషయాన్ని గ్రహించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Published : 28 Mar 2024 03:30 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

సిద్దిపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కరవు పరిస్థితులను భారాస రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని, కరవుకు కాంగ్రెస్‌ కారణం కాబోదనే విషయాన్ని గ్రహించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. భారాస అధికారంలో నుంచి దిగే నాటికి రాష్ట్రంపై రూ.7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని.. రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లుల భారాన్ని తమపై మోపారని ఆరోపించారు. బుధవారం సిద్దిపేటలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గితే... కాంగ్రెస్‌ కరవు తెచ్చిందంటూ రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు వాస్తవాలకు విరుద్ధంగా వ్యాఖ్యానించడం తగదన్నారు.  ఎద్దడి ఉన్నా.. అన్ని శాఖల సమన్వయంతో సాగు, తాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. పంటల బీమా అమలు చేసి ఉంటే రైతులు చనిపోకుండా ఆపే అవకాశం ఉండేదన్నారు. ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు.  తమ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన వాటా తీసుకుంటామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సమస్యలన్నీ పూర్తయినట్లు కేంద్రానికి నివేదిక ఇచ్చారని, ప్రస్తుతం తాము నిధులు అడిగితే ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. రేషన్‌కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులపై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో మానకొండూర్‌ ఎమ్మెల్యే సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని