ప్రజల దృష్టి మరల్చేందుకే తెరపైకి ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలను వదిలేసిందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Published : 28 Mar 2024 03:32 IST

పదేళ్ల నిజానికి.. వంద రోజుల అబద్ధానికి మధ్య ఎన్నికలివి
13న చేవెళ్లలో కేసీఆర్‌ బహిరంగ సభ
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలను వదిలేసిందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. పాలన చేతకాక స్కాములు, స్కీములు, ట్యాపింగ్‌ల పేరుతో డ్రామాలు ఆడుతోందన్నారు. పదేళ్ల నిజానికి.. వంద రోజుల అబద్ధానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివి అని అభివర్ణించారు. 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, కొంతమంది భారాస ఎమ్మెల్యేలతో కలిసి భాజపాలో చేరాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన అని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు, నేతలతో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘కేజ్రీవాల్‌ అరెస్టును రాహుల్‌ గాంధీ అన్యాయం అంటారు. అదే కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేస్తే రేవంత్‌ కరెక్టే అంటున్నారు. రాహుల్‌ కరెక్టా లేదా రేవంత్‌రెడ్డి కరెక్టా అనేది కాంగ్రెస్‌ చెప్పాలి. రేవంత్‌రెడ్డికి సచివాలయంలో లంకెబిందెలు కనిపించాయో లేదో గాని.. నగరంలో ఖాళీ నీటిబిందెలు మాత్రం కనిపిస్తున్నాయి. భారాస ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవదని చేవెళ్ల సభలో సీఎం అడ్డగోలుగా మాట్లాడారు. దమ్ముంటే ఇప్పటికైనా నాతో మల్కాజిగిరిలో పోటీకి రావాలి. ఆయనకు సవాల్‌ను స్వీకరించే దమ్ము లేదు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం సంక్షోభంలో చిక్కుకున్నా.. కరవుతో సతమతమవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్‌రెడ్డి మొదలుకొని యూట్యూబ్‌ ఛానెళ్లలో అడ్డగోలుగా పార్టీపై, నాయకత్వంపై మాట్లాడేవారికి.. ఓటు ద్వారానే బుద్ధి చెబుదాం’’ అని కేటీఆర్‌ అన్నారు.

రంజిత్‌రెడ్డి స్వార్థపరుడు..

భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేటీఆర్‌ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పి అధికారం, ఆస్తుల కోసం రంజిత్‌రెడ్డి పార్టీని వీడి ద్రోహం చేశారు. తన సోదరిగా చెప్పుకొనే కవితను ఈడీ అరెస్ట్‌ చేసిన రోజే.. కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడు. గత ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి సైతం పార్టీ కంటే తానే ఎక్కువనుకుని.. వేరే పార్టీలోకి వెళ్తే ఫలితం ఏమైందో తెలుసు. పార్టీ కంటే తామే పెద్దవారమనుకునే వ్యక్తులు రాజకీయాల్లో గెలవలేరు. కొన్ని దశాబ్దాలుగా బీసీలకు అండగా నిలబడిన కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపు తథ్యం. ఏప్రిల్‌ 13న చేవెళ్ల నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ పాల్గొంటారు’’ అని కేటీఆర్‌ తెలిపారు.

వెన్నుపోటు పొడిచిన వాళ్లకు బుద్ధిచెప్పాలి..

‘‘హుజూరాబాద్‌, గజ్వేల్‌లలో ఓడిన ఈటల రాజేందర్‌ మల్కాజిగిరిలో పోటీ చేస్తున్నారు. దమ్ముంటే మల్కాజిగిరి, కంటోన్మెంట్‌లకు భాజపా ఏం చేసిందో చెప్పి ఓట్లడగాలి. మల్కాజిగిరిలో పోటీచేస్తున్న కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు కేసీఆర్‌ ద్వారా పదవులు పొంది వెన్నుపోటు పొడిచారు. వారికి ఓటుతో బుద్ధిచెప్పాలి. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నది రాగిడి లక్ష్మారెడ్డి అయినా.. గులాబీ సైనికులంతా ఎన్నికల్లో నిలబడినట్లుగా పనిచేద్దాం’’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారాస విజయానికి కృషి చేస్తానని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పార్టీ మారుతున్నానని తనపై జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని జ్వరమొచ్చినా సమావేశానికి వచ్చానని చెప్పారు. సమావేశంలో భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(సనత్‌నగర్‌), మల్లారెడ్డి(మేడ్చల్‌), మర్రి రాజశేఖర్‌రెడ్డి(మల్కాజిగిరి), కేపీ వివేకానంద్‌(కుత్బుల్లాపూర్‌), సుధీర్‌రెడ్డి(ఎల్బీనగర్‌), బండారి లక్ష్మారెడ్డి(ఉప్పల్‌), ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌, కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందితకు కేటీఆర్‌, నేతలు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరుకాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని