ఎన్నికల్లో కీలకాంశం నిరుద్యోగమే

నిరుద్యోగ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రధాని మోదీ అన్ని విధాల ప్రయత్నిస్తున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశమే దేశ భవిష్యత్తును నిర్ణయించనుందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

Published : 28 Mar 2024 03:52 IST

 కాంగ్రెస్‌ వద్ద నిర్దిష్ట పరిష్కార ప్రణాళిక: ఖర్గే

దిల్లీ: నిరుద్యోగ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రధాని మోదీ అన్ని విధాల ప్రయత్నిస్తున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశమే దేశ భవిష్యత్తును నిర్ణయించనుందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. నిరుద్యోగమనే టైమ్‌ బాంబుపై దేశం ఉందని తెలిపింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), మానవ అభివృద్ధి సంస్థ (ఐహెచ్‌డీ)లు విడుదల చేసిన ‘భారతదేశ ఉపాధి నివేదిక 2024’ను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉటంకిస్తూ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న ప్రధాని మోదీ గత పదేళ్లలో ఆ హామీని నెరవేర్చక పోగా 12 కోట్ల ఉద్యోగాలను లాగేసుకున్నారని ఆరోపించారు. ఫలితంగా దేశంలోని యువతలో 83శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 17.5 శాతం యువతకు మాత్రమే నిత్యం పని దొరుకుతుందన్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకే తమ పార్టీ ప్రణాళికలº ‘యువ న్యాయ్‌’ను చేర్చినట్లు ఖర్గే వివరించారు. తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి సామాజిక, ఆర్థిక సవాల్‌ను ప్రభుత్వం పరిష్కరించలేదని, నిరుద్యోగం వంటి సమస్యల పరిష్కారం కంటే రోగ నిర్ధారణే సులభమంటూ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం తీవ్రంగా దుయ్యబట్టారు. ఇదే భాజపా అధికారిక వైఖరైతే అధికారం నుంచి వైదొలగాలని గట్టిగా డిమాండ్‌ చేయవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని