దిలీప్‌ ఘోష్‌, సుప్రియాలకు ఈసీ నోటీసులు

ఎన్నికలవేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Published : 28 Mar 2024 03:54 IST

వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో..

దిల్లీ: ఎన్నికలవేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై దిలీప్‌ ఘోష్‌, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు సుప్రియా శ్రీనేత్‌లకు నోటీసులు పంపింది. శుక్రవారం సాయంత్రంలోగా వీటిపై తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు సందర్భానికి తగ్గట్టు గానీ, హుందాగా గానీ లేవని ఈసీ ఆక్షేపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వీరు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామంది. ఎన్నికల ప్రచారంలో పార్టీలు గౌరవప్రదంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించింది. ఎవరిపైనైనా విమర్శలు చేస్తే అవి వారి విధానాలు, కార్యక్రమాలు, పనితీరు వరకే పరిమితం కావాలని స్పష్టంచేసింది. ఇతర పార్టీల నేతల, కార్యకర్తల ప్రైవేటు జీవితాల గురించి ఎలాంటి విమర్శలు చేయరాదంది. నిరాధారమైన, వాస్తవాలను వక్రీకరించే ఆరోపణలు చేయవద్దని తెలిపింది. మాటలు, చేతల ద్వారా మహిళల హుందాతనానికి భంగం కలిగించరాదని చెప్పింది. ఘోష్‌ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని భాజపా బుధవారం కోరడంతో ఆయన దీదీకి క్షమాపణలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని