మహావికాస్‌ అఘాడీలో లుకలుకలు

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం మహారాష్ట్రలోని 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో విపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమిలో రగడ రాజుకుంది.

Published : 28 Mar 2024 03:59 IST

శివసేన (యూబీటీ) 17 మంది అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్‌ అసంతృప్తి

ముంబయి: ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం మహారాష్ట్రలోని 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో విపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమిలో రగడ రాజుకుంది. ఓవైపు పొత్తులపై చర్చలు జరుగుతుండగా యూబీటీ జాబితా విడుదల చేయడంపై కాంగ్రెస్‌ మండిపడింది. పొత్తు ధర్మాన్ని పాటించాలని ఆ పార్టీని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత బాలాసాహెబ్‌ థోరట్‌ కోరారు. తాము పోటీ చేయాలనుకుంటున్న సాంగ్లీ సీటులో యూబీటీ తన అభ్యర్థిని నిలబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌.. సీట్ల సర్దుబాటుకు అంగీకరించిన వారు మహారాష్ట్రలో పార్టీకి సమాధి కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

17 మంది జాబితాలో కేంద్ర మాజీ మంత్రులు

శివసేన ప్రకటించిన జాబితాలో కేంద్ర మాజీ మంత్రులు అనంత్‌ గీతే (రాయ్‌గఢ్‌), అరవింద్‌ సావంత్‌ (దక్షిణ ముంబయి)లకు చోటు దక్కింది. పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ అనిల్‌ దేశాయ్‌ దక్షిణ మధ్య ముంబయి నుంచి పోటీ చేయనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. 44 సీట్లకు సంబంధించి మహా వికాస్‌ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్‌ 16, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ 9 సీట్లలో పోటీచేసేందుకు అంగీకారం కుదిరింది. మిగిలిన నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) 17 మందితో తొలి జాబితాను ప్రకటించడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని