ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తనవద్ద లేదని, అందుకే భాజపా ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

Published : 28 Mar 2024 04:05 IST

అందుకే పార్టీ ఆఫర్‌ను తిరస్కరించా
నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్య

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తనవద్ద లేదని, అందుకే భాజపా ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్లను అన్ని పార్టీలూ సొమ్ము చేసుకున్నాయని, అందుకే ఏ పార్టీకీ విమర్శించే నైతిక హక్కు లేదని అభిప్రాయపడ్డారు. బుధవారం టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో ఆమె మాట్లాడారు.

‘ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆఫర్‌ ఇచ్చారు. దీనిపై వారం పది రోజులపాటు ఆలోచించాక పోటీ చేయలేనని ఆయనకు చెప్పా. ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నావద్ద లేదు. ఆంధ్రప్రదేశ్‌ అయినా తమిళనాడు అయినా నాకు ఇబ్బందులున్నాయి. విజయావకాశాలపై పలు ప్రశ్నలు వచ్చాయి. మీరు ఫలానా సామాజిక వర్గమా, ఫలానా మతమా.. మీరు అక్కడి నుంచి వచ్చారా.. ఇక్కడి నుంచి వచ్చారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పా. నా ఈ వాదనను అధిష్ఠానం అంగీకరించింది’ అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దేశ ఆర్థిక మంత్రికి ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు లేదా అని ప్రశ్నించగా.. అది దేశానికి సంబంధించిన డబ్బని, తనది కాదని సమాధానమిచ్చారు. ‘నా వేతనం, నా సంపాదన, నా పొదుపు డబ్బులే నావి. మిగతావి దేశం డబ్బు’ అని పేర్కొన్నారు.  ఎన్నికల బాండ్లు చట్టబద్ధమైనవని, అన్ని పార్టీలూ వాటిని సొమ్ము చేసుకున్నాయని సీతారామన్‌ స్పష్టం చేశారు. అందువల్ల ఏ పార్టీకీ వాటిని విమర్శించే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటిపై మరింత చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మరింత మంచి విధానంతో తేవాల్సి ఉందని పేర్కొన్నారు. ‘పార్లమెంటులో చేసిన చట్టం ఆధారంగానే ఎన్నికల బాండ్ల విక్రయం సాగింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికీ ఇచ్చారు. దీనిని కుంభకోణంగా అభివర్ణిస్తున్న పార్టీ కూడా ఎన్నికల బాండ్లను నగదుగా మార్చుకుంది. భాజపాకు విరాళాలిచ్చాక కూడా ఈడీ దాడులు ఆయా కంపెనీలపై జరిగాయి. దానికీ దీనికీ సంబంధం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని