డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్‌

అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్‌ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు.

Published : 28 Mar 2024 05:17 IST

సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు, సీఈఓ పరిశీలించాలి
ఈ వ్యవహారంపై ఆర్టీసీ వివరణ ఇవ్వాలి
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ డిమాండు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్‌ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. విశాఖ డ్రగ్‌ కంటెయినర్‌ ఉదంతం మరవకముందే, రేణిగుంటలో డంప్‌ బయటపడిన 24 గంటల్లోనే తాడేపల్లి కంటెయినర్‌ వ్యవహారం బట్టబయలైందని ధ్వజమెత్తారు. గతంలో ఏ సీఎం ఇంటికైనా ఇలా కంటెయినర్లు వెళ్లిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆ కంటెయినర్‌ ‘మేమంతా సిద్ధం’ యాత్రకు వంటపాత్రలు తరలించడానికి వచ్చిందని వైకాపా నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన వాహనం విజయవాడ బస్టాండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ ముందు ఆగింది. అందులోంచి కరెన్సీ కట్టలతో నిండిన అట్టపెట్టెలను డిపో క్లర్క్‌ దించి, ఓ అధికారి ఛాంబర్‌లోకి తీసుకెళ్లారు’’ అని ఆరోపించారు.

స్మగ్లర్‌ విజయానందరెడ్డి సహకారంతోనే

‘‘ఎర్రచందనం స్మగ్లర్‌ విజయానందరెడ్డి లాంటి వ్యక్తులకు ఆర్టీసీలో పదవులు కట్టబెట్టి ఆ సంస్థ ప్రతిష్ఠను జగన్‌ దిగజార్చారు. ఆయన సహకారంతోనే ఆర్టీసీని క్యాష్‌ స్మగ్లింగుకు వాడుకుంటున్నారు. ఆ కంటెయినర్‌లో వచ్చింది డబ్బో కాదో ఆర్టీసీ సమాధానం చెప్పాలి. బస్టాండు సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టాలి. పోలీసులు, ఈసీ బృందం, మీడియా అక్కడికి వెళ్తే అసలు విషయం బయటపడుతుంది. డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి నిజాయతీ ఉంటే ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలి’’ అని డిమాండు చేశారు.

ఏపీఎస్‌ఆర్టీసీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది?

‘‘దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపులు చేస్తుంటే ఇంత భారీగా కరెన్సీ కట్టలు వారి దగ్గరికి ఎలా చేరాయో ఏపీఎస్‌ఆర్టీసీ వివరణ ఇవ్వాలి. ‘మేమంతా సిద్ధం’ అంటూ ప్రచారసభలు నిర్వహిస్తున్న జగన్‌.. దేనికి సిద్ధం? మాదక ద్రవ్యాలు, నోట్ల కట్టల పంపిణీకా? ఈ కంటెయినర్ల వ్యవహారాలపై ప్రజలకు ఆయన ఏం సమాధానం చెబుతారు? ఈ ఘటనపై విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలి’’ అని పట్టాభిరామ్‌ డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని