క్యాష్‌ కొట్టు.. బస్సులు పట్టు

ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది.

Published : 28 Mar 2024 05:18 IST

సిద్ధం సభలకు వేల ఆర్టీసీ బస్సులు తీసుకున్న వైకాపా
వాటికి రూ.20 కోట్ల నగదు చెల్లింపు
అంత డబ్బు ఎక్కడిది?

ఈనాడు, అమరావతి: ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. ఇందులో ప్రత్యేకత ఏంటనే సందేహం కలుగుతోందా? ఈ సొమ్మంతా నగదు రూపంలో తీసుకెళ్లి ఆర్టీసీ అధికారుల వద్ద జమచేశారు. అదంతా ఎక్కడిది? పార్టీకి వచ్చిన విరాళాలైతే.. వాటిని ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు కదా? ఇలా నగదుగా ఎందుకు చెల్లించారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో మూడేళ్లుగా నగదు మాత్రమే తీసుకొని ‘ముఖ్య’నేతకు చెందిన గుత్తేదారు ఇసుక విక్రయాలు చేస్తున్నారు. ఆ ఇసుక సొమ్మంతా ఏమవుతోందనే సందేహాలు ఇప్పటికే ఉన్నాయి. మద్యం దుకాణాల్లోనూ డబ్బులు తీసుకునే అమ్ముతున్నారు. ఆ సొత్తు గమ్యంపైనా అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వైకాపా నేతలు ఆర్టీసీ బస్సులకు చెల్లించేందుకు అంత నగదు ఎలా వచ్చిందనేది అనుమానాలకు తావిస్తోంది. రోడ్డు పక్కన బండి వద్ద పానీపూరీ, చాట్‌ తిన్నా రూ.20-30 డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్న రోజులివి. కానీ వైకాపా నేతలు మాత్రం కోట్ల రూపాయలను నగదుగానే ఆర్టీసీకి చెల్లించారు.

చెల్లింపుల్లో అతితెలివి

వైకాపా నాలుగు చోట్ల సిద్ధం సభలు నిర్వహించింది. ఇందులో భీమిలి సభకు 850 బస్సులు, దెందులూరు సభకు 1,350 బస్సులు, రాప్తాడు సభకు 3వేల బస్సులు, మేదరమెట్ల సభకు 3,500 బస్సులు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ముందే మొత్తం నగదు చెల్లించి, బస్సులు తీసుకోవాలి. కానీ అధికారపార్టీ కావడంతో పూర్తి సొమ్ము చెల్లించకుండా, కొంతమేరకే జమ చేసినా ఆర్టీసీ అధికారులు బస్సులు పంపారు. సభలన్నీ అయ్యాక మిగిలిన బకాయిలు చెల్లించారు. మొత్తంగా రూ.20 కోట్లు నగదు రూపంలో జమ చేయగా, ఇక్కడే తెలివితేటలు చూపారు. సభ జరిగిన జిల్లా, చుట్టుపక్కల ఉండే జిల్లాల పరిధిలో వివిధ డిపోల్లో ఈ చెల్లింపులు జరిపారు. అదీ ఒకేసారి కాకుండా రోజుకు కొంత చొప్పున 20-30 సార్లు చెల్లించారు. ఆయా జిల్లాల్లో వైకాపా నేతలు రోజుకు రూ.2 లక్షలలోపు చొప్పున 20, 30 సార్లు ఆర్టీసీ అధికారులకు నగదు చెల్లిస్తూ వచ్చారు. అయితే ఇదంతా పార్టీ పేరిటే చెల్లించినట్లు తెలిసింది.

బాండ్ల సొమ్ము ఉందిగా?

వైకాపాకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.422 కోట్లు వచ్చినట్లు ఇటీవలే బయటకొచ్చింది. ఈ సొమ్ము ఉండగా.. బస్సుల కోసం ఆన్‌లైన్‌ చెల్లింపులు చేయకుండా, నగదు ఎందుకు ఇచ్చారు? ఎన్నికలకు ముందు.. కోడ్‌ అమల్లో ఉన్నప్పుడూ నగదు ద్వారానే చెల్లింపులు ఎలా చేస్తున్నారనేది అనుమానాలకు తావిస్తోంది.


మేమంతా సిద్ధం సభలకూ ఇంతే..

ప్రస్తుతం జగన్‌ బుధవారం నుంచి మేమంతా సిద్ధం సభలకు హాజరవుతున్నారు. 21 జిల్లాల్లో జరిగే ఈ సభలకు సైతం ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో బస్సులకు మొత్తం సొమ్మును ముందే చెల్లిస్తున్నారు. పార్టీ పేరిట బస్సులు బక్‌ చేస్తే.. ఎన్నికల వ్యయం కిందకు వస్తుంది. అందుకే ఒక్కో డిపో పరిధిలో వేర్వేరు వ్యక్తుల పేరిట బస్సులు బక్‌ చేస్తున్నారు. ఒక్కొక్కరూ రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు బస్సుల కోసం చెల్లిస్తున్నారు. ఇదీ నగదే. ఎక్కడా ఆన్‌లైన్‌, డిజిటల్‌ చెల్లింపుల్లేవు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని