పవన్‌కల్యాణ్‌తో నాయకుల సమావేశం

ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు.

Updated : 28 Mar 2024 06:01 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన పవన్‌ను కలిశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌తో పాటు మాగుంట రాఘవ్‌ ఈ భేటీలో ఉన్నారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి వరప్రసాద్‌ కూడా పవన్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.


పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే కఠిన చర్యలు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హెచ్చరిక

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జనసేన, తెదేపా, భాజపాలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఎవరైనా పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వార్థ బుద్ధితో వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ‘నాయకులు, శ్రేణులు ఈ పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మూడు పార్టీల శ్రేణులూ క్షేత్రస్థాయిలో కలిసి ముందుకు సాగాలి’ అని ఆయన పేర్కొన్నారు.

మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం

రాజకీయంగా వీర మహిళల ఎదుగుదలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని పవన్‌ తెలిపారు. మొదటి నుంచి వారు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. వివిధ కమిటీల్లో ఉన్న వీరమహిళలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశమై మాట్లాడారు. వివిధ కమిటీల్లో ఉన్న వారికి నియామక పత్రాలు అందించారు. కులం, మతం, ప్రాంతాలు దాటి మహిళా నాయకత్వాన్ని పూర్తిస్థాయిలో బలపరిచే బాధ్యత తీసుకుంటానని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని