మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు

‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది.

Published : 28 Mar 2024 05:22 IST

ఇదీ వైకాపా పాలన తీరు
‘నిజం గెలవాలి’ యాత్రలో భువనేశ్వరి

ఈనాడు, ఏలూరు, విజయవాడ (హనుమాన్‌జంక్షన్‌)- న్యూస్‌టుడే: ‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే తెదేపా అధికారంలోకి రావాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె రెండో రోజు బుధవారం ‘నిజం గెలవాలి’ యాత్ర చేశారు. టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సాయంత్రం ఆమె కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బిళ్లనపల్లిలో పర్యటించి హనుమాన్‌జంక్షన్‌లో మాట్లాడారు. ఆయా సమావేశాల్లో జగన్‌ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని వైకాపా గంజాయి రాజ్యంగా మార్చింది. విశాఖలో 25 వేల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అది గంజాయి రాజధానిగా మారింది. నీళ్లు రావటం లేదని స్థానిక వైకాపా నాయకులను ప్రశ్నించినందుకు ఓ మహిళ కళ్లు తీసేశారు. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పెట్టినందుకు చంద్రయ్య అనే రైతును హత్య చేశారు. వైకాపా పాలనలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మీ ఓటు ఉందో లేదో చూసుకోవాలి. దాంతోపాటు ఇళ్లు, పొలాలు ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు వాటినీ మింగేస్తారు. మహిళలంతా తెదేపా, జనసేన, భాజపా కూటమికి ఓటెయ్యాలి. నిజాన్ని గెలిపించాలి’ అని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక అప్పట్లో చనిపోయిన టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం వాసి అబ్బదాసరి కృష్ణ, తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన కుంటి శేఖర్‌, పెంటపాడు మండలం పడమర విప్పర్రులో కోడి అప్పారావు, నిడమర్రులో గొర్రెల సుబ్బారావు కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. కృష్ణా జిల్లాలోని బిళ్లనపల్లిలో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎదురువాడ కిరణ్‌, సీనియర్‌ కార్యకర్త ఎదురువాడ బసవరావు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు