రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి అసమ్మతి సెగ

‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్‌రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు.

Published : 28 Mar 2024 05:23 IST

మార్చకుంటే ఓడిస్తామని హెచ్చరిక

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: ‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్‌రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. తేనె పూసిన కత్తి లాంటివాడని గెలిచిన మూడు నెలలకే తేలిపోయింది’ అని అనంతపురం జిల్లా, రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డిపై ఆ పార్టీ అసమ్మతి నేతలు ధ్వజమెత్తారు. ఆయనను మార్చకుంటే తామంతా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. బుధవారం రాప్తాడు నియోజకవర్గంలోని వైకాపా అసమ్మతి ముఖ్యనేతలంతా అనంతపురంలోని యాదవ కల్యాణమండపంలో సమావేశమయ్యారు. పలువురు నేతలు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశామని,  ప్రకాశ్‌రెడ్డి గెలిచిన తర్వాత కనీసం తమను ఇంట్లోకి కూడా రానీయలేదని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి సామాజికవర్గాల వారంతా ఈ సమావేశానికి హాజరయ్యారని, రాప్తాడు నుంచే మార్పు మొదలవుతుందని హెచ్చరించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గానికే అత్యధిక స్థానాలు ఇచ్చారని, ముఖ్యమంత్రి జగన్‌ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం, ధర్మవరం, ఉరవకొండలో వైకాపా అభ్యర్థులు ఓడిపోవాలని తెరవెనుక ఎమ్మెల్యే కుట్రలు చేసినట్లు వారు ఆరోపించారు. ఈ నెల 30వ తేదీలోగా తగిన నిర్ణయం తీసుకోకుంటే తెదేపా, కాంగ్రెస్‌కు మద్దతు లేదా స్వతంత్రంగానైనా పోటీ చేసి ప్రకాశ్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా పని చేస్తామని హెచ్చరించారు. తమను రాజకీయంగా వాడుకొని తమకు కేటాయించిన ఎర్రకొండ భూమిని కూడా లేకుండా చేసి అక్కడ సొంత సంస్థతో ఇళ్లు కట్టిస్తూ ఎమ్మెల్యే సొమ్ము చేసుకుంటున్నారని మాజీ మావోయిస్టు రాజారామ్‌ విమర్శించారు. సమావేశంలో బీసీ కమిషన్‌ సభ్యుడు, మాజీ జడ్జి కిష్టప్ప,  వైకాపా రాష్ట్ర కార్యదర్శి బుల్లే ఈశ్వరయ్య, వైకాపా జిల్లా కార్యదర్శి బిల్లే నరేంద్ర, కుంటిమద్ది ఆనంద్‌, నంద మోహన్‌రెడ్డి, వైఎస్సాఆర్‌ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని