ముందు చెల్లికి సమాధానం చెప్పాలి

బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్‌... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు.

Published : 28 Mar 2024 05:23 IST

ఆ తర్వాతే జగన్‌ ప్రజల్లోకి రావాలి
మదనపల్లె సభలో చంద్రబాబు

న్యూస్‌టుడే, రాయచోటి, మదనపల్లె పట్టణం: బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్‌... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. చెల్లెళ్లే మీకు ఓట్లేయవద్దని చెబుతుంటే...  ప్రజల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని ఎద్దేవా చేశారు. ధైర్యం ఉంటే సునీతకు సమాధానం చెప్పి... ఆ తర్వాతనే ప్రజల్లోకి వెళ్లాలని సవాలు విసిరారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘వైకాపా పాలనలో రాష్ట్రంలో గంజాయి వాణిజ్య పరిశ్రమగా మారిపోయింది. మదనపల్లెలోనూ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. మద్యం రూపంలోనూ దోపిడీకి పాల్పడిన ఘనుడు జగన్‌. ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీలు, పన్నులు, మద్యం, డీజిల్‌, పెట్రోలు ధరల బాదుడుకు ఎవరు కారణమో ఆలోచించుకోండి. యువతకు ఉద్యోగాలివ్వలేదు. మరోపక్క ఉద్యోగుల బకాయిల్ని ఎగ్గొట్టారు.  పిల్లల చదువులు, వివాహాలకు దాచుకున్న పీఎఫ్‌ డబ్బునూ మళ్లించేశారు. ఉద్యోగులారా.. మీ భవిష్యత్తుకు నేను భరోసాగా ఉంటా. కూటమి అధికారంలోకి వస్తే జీతాల్ని నిర్ణీత సమయానికి ఇవ్వడమే కాకుండా ఉద్యోగులకు భద్రత కల్పిస్తా’ అని చంద్రబాబు చెప్పారు. అందరూ ఉదయం లేవగానే టిఫిన్‌ తింటారని, మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ఇసుకను బొక్కుతున్నారని, రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా మదనపల్లె అభ్యర్థి షాజహాన్‌బాషా, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని