రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి

యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్‌ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated : 28 Mar 2024 06:50 IST

జగన్‌ను అడుగడుగునా నిలదీయండి
ప్రాజెక్టుల్ని ఎండబెట్టారు... ‘సాక్షి’కి కూడబెట్టారు
జనం ఆవేదన అగ్నిలా మారి అరాచక  వైకాపాను భస్మం చేయాలి
బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చే బాధ్యత నాది
పలమనేరు, పుత్తూరు ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, చిత్తూరు, తిరుపతి: యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్‌ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘సీఎం బస్సు యాత్రకు ఖాళీ రోడ్లు, ఇళ్లే స్వాగతం పలకాలి. బాబాయిపై గొడ్డలివేటు వేసిన అవినాశ్‌రెడ్డీ అదే బస్సులో ఉన్నారు. ఆయనకు జగన్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చి ప్రజల్ని వెక్కించారు. 2014-19లో నేను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.65 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాం. ప్రత్యేకించి రాయలసీమలోనే రూ.12 వేల కోట్లు వెచ్చించాం. ఒక్క హంద్రీ-నీవా ప్రాజెక్టుకే రూ.4,200 కోట్లు ఇచ్చాం. తర్వాత ఐదేళ్లలో కేవలం రూ.2,165 కోట్లనే వైకాపా ప్రభుత్వం ఖర్చుపెట్టింది. 102 ప్రాజెక్టుల్ని రద్దు చేసింది. అవినీతిలో పుట్టిన సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో వందల కోట్ల రూపాయల్ని దోచిపెట్టారు’ అని చంద్రబాబు మండిపడ్డారు. డబ్బు వసూలుకు, దౌర్జన్యాలు చేసేందుకు నియమించుకున్న సలహాదారులకు సీమ సాగునీటి ప్రాజెక్టులపై పెట్టినదాని కన్నా ఎక్కువ మొత్తం ఇచ్చారని, అందుకే జగన్‌ను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు, తిరుపతి జిల్లా పుత్తూరులో చంద్రబాబు బుధవారం ‘ప్రజాగళం’ సభలు నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

‘భాజపాతో కలిసిన మమ్మల్ని జగన్‌ విమర్శిస్తున్నారు. పొత్తు మా స్వార్థం కోసం కాదు. దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఎన్డీయేతో జట్టుకట్టాం. ఈ సీఎం రాష్ట్ర అప్పుల భారాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచారు. సంక్షేమ పథకాలు ఇవ్వలేని స్థితికి వచ్చారు. అభివృద్ధి నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో రాష్ట్రం సజావుగా ముందుకు సాగాలంటే కేంద్రం సహకారం అవసరం. అందుకే మూడు పార్టీలూ కలిశాయి’ అని చంద్రబాబు చెప్పారు. ‘ప్రజల్లో ఎక్కడ చూసినా ఆవేదన కనిపిస్తోంది. ఎన్నికల్లో అది అగ్నిగా మారి అరాచక వైకాపాను భస్మం చేయాలి. జగన్‌రెడ్డీ సిద్ధంగా ఉండు. నిన్ను నీ ప్రభుత్వాన్ని, కుర్చీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత మీ అహంకారం కూలిపోతుంది’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘కలలకు రెక్కలు.. పథకం కింద విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చే బాధ్యత నాది. కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు పెరగవు. అన్న క్యాంటీన్లు మళ్లీ వస్తాయి. రూ.4 వేల పింఛన్‌ను మొదటి తేదీనే మీ ఇంటికి చేరుస్తాం. చేనేతల కోసం ప్రత్యేక విధానం తెస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పూజారులపైనా దాష్టీకం

‘వైకాపా పాలనలో ఎస్సీలను చంపి డోర్‌ డెలివరీలు చేశారు. మైనారిటీ అమ్మాయి మిస్బా ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది. బాగా చదువుకుని మొదటి ర్యాంకు తెచ్చుకుంటే దుర్మార్గులైన వైకాపా నాయకులు వేధించారు. లక్ష్యాన్ని చేరుకోలేనని బాధపడి ఆ చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. వైకాపాకు ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏం జరిగిందో.. మీకూ మీ పిల్లలకూ అదే జరుగుతుంది. కాకినాడ శివాలయంలో పూజారులపై వైకాపా నాయకుడు దాడికి పాల్పడితే రాజీ చేశారు. వైకాపా అంటేనే కొట్టడం, తిట్టడం, దూషించడం’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఆయన పేదవారా?

‘పేదలకు అన్నంపెట్టే అన్నక్యాంటీన్‌లను రద్దు చేసిన వ్యక్తి పేదవారా? బీద పిల్లల కోసం విదేశీ విద్య ఉన్నత పథకాన్ని తీసుకువస్తే దానిని అటకెక్కించిన వారు పేదవారా? బడుగుల కోసం మేం నిర్మించిన లక్షల ఇళ్లను నిరుపయోగంగా ఉంచిన వ్యక్తి పేదవారా?’ అని చంద్రబాబు విమర్శించారు. ‘దేశంలోని సీఎంలు అందరికీ ఎంత ఆస్తి ఉందో అంతకంటే ఎక్కువ సంపాదించారు ఈ ముఖ్యమంత్రి. పేదలను మరింత నిరుపేదలుగా మారుస్తున్న పెత్తందారు జగన్‌’ అని దుయ్యబట్టారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం

పలమనేరు సభలో కొంతసేపు మైకులు పనిచేయలేదు. మొదట సాంకేతిక లోపమని భావించారు. మైకుల కేబుల్‌ కనెక్టర్‌ను ఎవరో పగలగొట్టారని తర్వాత గుర్తించారు. దీనిని వైకాపా దుశ్చర్యగా తెదేపా నాయకులు అనుమానిస్తున్నారు. మరో కేబుల్‌ కనెక్టర్‌ సాయంతో సభను కొనసాగించారు. పుత్తూరులో మధ్యాహ్నం 3.30 గంటలకు బహిరంగ సభకు చంద్రబాబు వచ్చే సమయానికి విద్యుత్తు నిలిచిపోయింది. సాయంత్రం ఐదు గంటలకు ఆయన సభ ముగించి వెళ్లే దాకా సరఫరాను పునరుద్ధరించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని