ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం

ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు.

Published : 28 Mar 2024 05:41 IST

ఈనాడు, అమరావతి: ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. జిందాల్‌ కంపెనీకి అప్పగించొద్దని పేర్కొన్నారు. ‘‘ఒంగోలు గ్రామీణ మండలం యర్రజర్ల, టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు, కందులూరు గ్రామాల పరిధిలోని 1,307 ఎకరాల లోగ్రేడ్‌ మాగ్నటైట్‌ ఇనుప ఖనిజ నిక్షేపాలను జిందాల్‌కు అప్పగించడం సరికాదు. విశాఖ ఉక్కు కర్మాగారం అవసరమని కోరినప్పటికీ కేటాయించకపోవడం రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించే చర్య. జిందాల్‌కు కేటాయించడాన్ని ఆపి, విశాఖ ఉక్కుకు కేటాయించాలి. ఇక్కడ ఉన్న ఖనిజంలో 30శాతం ఇనుప ఖనిజం ఉంటుంది. బెనిఫికేషన్‌ ద్వారా ఐరన్‌ కంటెంట్‌ పెంచి ఉక్కు తయారీకి వినియోగిస్తారు. 2003 ధరల ప్రకారం ప్రపంచ మార్కెట్‌లో ఇనుప ఖనిజం టన్ను ధర రూ.4,083 ఉంది. 11శాతం వాటా కింద ఖనిజాభివృద్ధి సంస్థకి టన్నుకు రూ.449.13, జిందాల్‌ కంపెనీకి 89 శాతం వాటా ప్రకారం రూ.3,638.97 వస్తుంది. 50లక్షల టన్నులు తవ్వితే ఖనిజాభివృద్ధి సంస్థకు రూ.224.56కోట్లు, జిందాల్‌కు రూ.1,816.93కోట్లు రాబడి వస్తుంది. భారీ లాభాలు జిందాల్‌కు దక్కుతాయి. దీంతో రాష్ట్ర సంపదను అక్రమంగా జిందాల్‌కు అప్పగించడమే అవుతుంది. వెంటనే జిందాల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవాలి’’ అని సూచించారు.

అర్చకుడిపై దాడి చేసిన నేతపై చర్యలు తీసుకోవాలి

కాకినాడ శివాలయంలో పూజారి వెంకట సత్యసాయిని అసభ్యపదజాలంతో దూషిస్తూ చెంపపై కొట్టి, కాలితో తన్నిన వైకాపా మాజీ కార్పొరేటర్‌ సిరియాల చంద్రరావుని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ‘‘అధికార దర్పంతో దేవాలయ పూజారులపై దాడులు చేయడం, దుర్భాషలాడే వారిపట్ల ఉదాసీనంగా వ్యవహరించడం తగదు. దాడికి పాల్పడిన వైకాపా మాజీ కార్పొరేటర్‌ సిరియాల చంద్రరావుని అరెస్టు చేయకుండా రహస్యంగా క్షమాపణ చెప్పించడం విడ్డూరంగా ఉంది. తాను క్షమాపణ చెప్పలేదని చంద్రరావు బహిరంగంగా ప్రకటించడం, ప్రాణహాని ఉందని పూజారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం చూస్తుంటే నామమాత్రపు 47ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడం బాధితులకు విశ్వాసం కలిగించదు. పూజారి కుటుంబానికి రక్షణ కల్పించాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని