ఇంటికి కిలో బంగారం పంచినా జగన్‌కు ఓటమే

అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

Published : 28 Mar 2024 05:41 IST

తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లిన కంటెయినర్‌ పోలీసులకు కనిపించలేదా?: లోకేశ్‌ ప్రశ్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడానికి ఇంటికి కిలో బంగారం పంచినా ఆయనకు ఓటమి తప్పదని పేర్కొన్నారు. తాయిలాల పంపకంలాంటి చీప్‌ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయలేరని స్పష్టం చేశారు. ‘రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి చెందిన గోదాంలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రతోపాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటినైతే పట్టుకున్నారు కానీ ఇసుక, మద్యం దందాలో దోచిన సొమ్ము డంప్‌ సంగతేంటి? ప్రజాగ్రహ జ్వాలలను అడ్డుకోవడం జగన్‌కు అసాధ్యం’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. గోదాంలో దాచిన వస్తువులున్న వీడియోను ట్వీట్‌కు జత చేశారు.

కంటెయినర్‌ వ్యవహారంపై డీజీపీ సమాధానం చెప్పాలి

‘రోజూ నా కాన్వాయ్‌ తనిఖీ చేస్తున్నారు. ఒక్క ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అయినా కనిపించిందా? నిబంధనలు బేఖాతరు చేసి మీ ఎదురుగా సీఎం ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు? అందులో ఏముంది? బ్రెజిల్‌ సరకా? మద్యంలో మెక్కిన రూ.వేల కోట్లా? రాష్ట్ర సచివాలయంలో దాచిన దొంగ దస్త్రాలా? ఈ ప్రశ్నలకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి సమాధానం చెప్పాలి’ అని మరో ట్వీట్‌లో లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని