6న తుక్కుగూడలో కాంగ్రెస్‌ బహిరంగ సభ

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్‌ 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని.. దీనికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హాజరవుతారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated : 29 Mar 2024 06:23 IST

హాజరుకానున్న రాహుల్‌ గాంధీ
సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

కొడంగల్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్‌ 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని.. దీనికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హాజరవుతారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం కొడంగల్‌కు వచ్చిన ఆయన తన నివాసంలో పార్టీ మండల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ వచ్చి తెలంగాణకు ఆరు గ్యారంటీలను ప్రకటించినట్టే.. రాహుల్‌ తుక్కుగూడ సభకు హాజరై జాతీయ స్థాయిలో 5 గ్యారంటీలను ప్రకటించనున్నారని పేర్కొన్నారు. వచ్చే నెల 8న కొడంగల్‌కు మరోమారు వస్తానని, పాత ఐదు మండలాల నాయకులతో, పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అవుతానని చెప్పారు. అప్పటివరకు నియోజకవర్గంలో అన్ని పోలింగ్‌ బూత్‌ కమిటీల ఏర్పాటు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.

కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం

రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కొడంగల్‌లో మొదటి విడతగా రూ.5 వేల కోట్ల పనులు చేపట్టామని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నారాయణపేట ఎత్తిపోతల పథకం, వైద్య, పశువైద్య కళాశాలలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కస్తూర్‌పల్లి సమీపంలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని, సిమెంటు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌, మల్లికార్జున ఖర్గేల ఆశీస్సులతో కొడంగల్‌కు ముఖ్యమంత్రి పదవి లభించిందని.. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకొనే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ అవసరాలకు భూములు సేకరిస్తే.. బహిరంగ మార్కెట్‌ ప్రకారం ధరలు చెల్లించి తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

కార్యకర్తల కష్టంతోనే సీఎం పదవి

కార్యకర్తలు కష్టపడటంతోనే తనకు సీఎం పదవి లభించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే’ అన్నట్టుగా తాను ముఖ్యమంత్రి అయినా మీ కుటుంబ సభ్యుడినేనన్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తాండూర్‌ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని