ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 99.8% పోలింగ్‌

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది.

Published : 29 Mar 2024 03:57 IST

ప్రశాంతంగా మహబూబ్‌నగర్‌  స్థానిక సంస్థల ఉపఎన్నిక
ఓట్ల లెక్కింపు ఏప్రిల్‌ 2న

ఈనాడు, మహబూబ్‌నగర్‌- కొడంగల్‌, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 10 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 1,439 మందికిగాను 1,437 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 99.86 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు కూడా ఎక్స్‌అఫిషియో హోదాలోనే ఓటేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైనా చాలాసేపటి వరకు ఎవరూ రాలేదు. ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా, ఏపీ, కర్ణాటక, తమిళనాడులలో ఏర్పాటు చేసిన శిబిరాలకు వెళ్లడంతో నేరుగా అక్కడి నుంచే పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో వచ్చారు.

పార్టీల వారీగా మూకుమ్మడిగా చేరుకున్నారు. నాగర్‌కర్నూల్‌ పోలింగ్‌ బూత్‌ పరిధిలో బిజినేపల్లి మండలం గుడ్లనర్వ ఎంపీటీసీ సభ్యురాలు శారద, నారాయణపేట పోలింగ్‌ బూత్‌ పరిధిలో మక్తల్‌ మండలం మంథన్‌గోడ్‌ ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర మాత్రమే ఓటుహక్కును వినియోగించుకోలేదు. వనపర్తి జిల్లా ఎదులా-1 ఎంపీటీసీ సభ్యుడు నరేందర్‌ 2 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ముందుగానే ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి పొంది ఆసుపత్రి నుంచి అంబులెన్సులో నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి భార్య కవిత ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గద్వాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, సీఐ భీంకుమార్‌ మధ్య వాగ్వాదం జరిగింది. తమ పార్టీకి చెందిన ఓటరు చక్రాలకుర్చీలో వస్తున్నారని వేచి చూస్తున్న ఎమ్మెల్యేను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సీఐ చెప్పడం వివాదానికి దారితీసింది. ఏఎస్పీ వచ్చి సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి, భారాస అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి పలుచోట్ల ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ నుంచి ఎన్నికల అధికారులు వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఓటింగ్‌ తీరును పర్యవేక్షించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం మహబూబ్‌నగర్‌ బాలుర జూనియర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూంకు బ్యాలెట్‌ పెట్టెలను తరలించారు. ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని