కాళేశ్వరం, కేసీఆర్‌పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.

Published : 29 Mar 2024 04:37 IST

సిరిసిల్ల పర్యటనలో మాజీ మంత్రి కేటీఆర్‌

తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. కాళేశ్వరం మీద, కేసీఆర్‌ మీద కడుపు మంటతో ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహించడంతో రైతుల పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా రైతులకు రుణమాఫీ చేయలేదు. గత కేసీఆర్‌ ప్రభుత్వం రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు నిల్వ ఉంచితే, వాటిని గుత్తేదారులకు కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదే. గతంలో కాళేశ్వరం నీటితో తంగళ్లపల్లి మండలంలోని అన్ని చెరువులను నింపి ఎండాకాలంలో రైతన్నలకు నీరు ఇచ్చాం. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన మూడు పిల్లర్ల వద్ద కాఫర్‌డ్యామ్‌ కడితే రైతులకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. దిల్లీకి యాత్రలు చేయడమే మినహా.. రైతుల పంటలను సీఎం, మంత్రులు పరిశీలించిన పాపానపోలేదు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు, ధాన్యంపై బోనస్‌ను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. దానికి ఎన్నికల కోడ్‌ అడ్డుకాదు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని