ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి: లక్ష్మణ్‌

రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 29 Mar 2024 03:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిందని, దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అవినీతిపరులను జైల్లో వేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో అసలు సూత్రధారులను బయటపెట్టాలన్నారు. పలువురు రాజకీయ, మీడియా ప్రముఖులు; బ్యూరోక్రాట్ల ఫోన్లు ట్యాప్‌ చేశారని.. వ్యాపారులను బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అసెంబ్లీ, ఉప ఎన్నికల సమయంలో ట్యాపింగ్‌తో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్‌ ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్‌ చేసి ఉండొచ్చని మాట్లాడుతున్నారని, పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే నాటి భారాస ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఏం చేసిందని ప్రశ్నించారు. మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారని, రాష్ట్రంలో మాత్రం అవినీతిపరులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ‘ధరణి’ అవకతవకలపై చర్యలు లేవని, డ్రగ్స్‌ కేసుల జాడ లేదని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని