చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్‌పై కేసు

ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు బుధవారం చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్‌పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 29 Mar 2024 06:22 IST

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ గృహ నిర్బంధం
పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించిన కిషన్‌రెడ్డి

బోడుప్పల్‌, ధూల్‌పేట- న్యూస్‌టుడే, ఈనాడు-హైదరాబాద్‌: ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు బుధవారం చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్‌పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ప్రాంతానికి వెళ్లబోయిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ రెండు ఘటనల్లో పోలీసుల చర్యను తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు.

సంజయ్‌పై నాచారం ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు

బండి సంజయ్‌ బుధవారం చెంగిచర్లకు వచ్చిన సందర్భంలో జరిగిన తోపులాటలో పోలీసు సిబ్బంది గాయపడ్డారంటూ నాచారం ఇన్‌స్పెక్టర్‌ నందీశ్వర్‌రెడ్డి మేడిపల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమతి లేని ప్రదేశానికి రావడంతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలను తీసుకురావడంతో పోలీసు విధులకు ఆటంకం కలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ జరిగిన తోపులాటలో పోచారం ఇన్‌స్పెక్టర్‌ రాజు, ఎస్సై లక్ష్మణ్‌, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో బండి సంజయ్‌తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

నన్ను అడ్డుకోవడం అన్యాయం: రాజాసింగ్‌

భారాస ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్‌ సర్కారులోనూ హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాలు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయనడానికి చెంగిచెర్లలో జరిగిన దాడే నిదర్శనమన్నారు. బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన తనను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేయడం అన్యాయమంటూ రాజాసింగ్‌ ఓ వీడియో విడుదల చేశారు.


పోలీసులది ఏకపక్ష ధోరణి: కిషన్‌రెడ్డి

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌పై కేసు పెట్టడం, ఎమ్మెల్యే రాజాసింగ్‌ని గృహ నిర్బంధం చేయడంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘భాజపా నాయకులపై ఆంక్షలు విధించడం ఏమిటి? ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, అక్రమ అరెస్టులు, కేసులతో అడ్డుకోవడమేనా’’ అని ప్రశ్నించారు. చెంగిచెర్లలో కబేళా తొలగించి, భాజపా నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు