రేవంత్‌ అధ్యక్షతన పీఈసీ సమావేశం నేడు

కాంగ్రెస్‌ ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది.

Published : 29 Mar 2024 03:59 IST

హాజరుకానున్న మంత్రులు, ఇతర ముఖ్యనేతలు
తుక్కుగూడ సభ, ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు హాజరు కానున్నారు. లోక్‌సభ ఎన్నికలు, ఏప్రిల్‌ 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభ, ఇప్పటివరకు ఖరారైన ఎంపీ స్థానాలు, వంద రోజుల పాలన తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. ఏప్రిల్‌ 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏఐసీసీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆవిష్కరిస్తారు. కాంగ్రెస్‌ 5 గ్యారంటీలను ఇదే వేదికపై ప్రకటించనున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు...

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడ నుంచే ప్రచారానికి శంఖారావం పూరించారు. ఇక్కడి సభావేదిక నుంచే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తుక్కుగూడను పార్టీ సెంటిమెంట్‌గా భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న తుక్కుగూడ బహిరంగ సభను రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. సభ విజయవంతానికి ఏర్పాట్లు, నిర్వహణ కమిటీలు, జనసమీకరణ తదితర అంశాలపై శుక్రవారం జరిగే పీఈసీ సమావేశంలో నేతలకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని